
మూడు రోజులు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లో బుధవారం ఉత్సాహం నెలకొంది. కొనుగోళ్లు పుంజుకోవడంతో సెన్సెక్స్ ఏకంగా 490 పాయింట్లు పెరిగింది. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటిహెవీ వెయిట్స్ షేర్లు కొనడానికి ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. సానుకూలంగా మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒకదశలో 39,095 పాయింట్లను తాకింది. బుధవారం సెన్సెక్స్ 1.3 శాతం వృద్ధితో 39,054 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోనూ కొనుగోళ్లు ఉరకలెత్తాయి. దాంతో నిఫ్టీ కూడా 150.2 పాయింట్లు లాభపడి, 11,726 వద్ద ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్ , ఓఎన్‌జీసీ షేర్లు 3.40 శాతం పెరిగి, సెన్సెక్స్‌లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇండస్ ఇండ్ ,యెస్ బ్యాంక్ , భారతి ఎయిర్ టెల్, హెచ్‌చ్‌డీఎఫ్‌సీ ,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ , ఆర్ ఐఎల్, బజాజ్ ఫైనాన్స్,ఎస్‌బీఐ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు2.75 శాతం చొప్పున పెరిగాయి.
టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, కోల్ ఇండి యా, పవర్ గ్రిడ్ ,మారుతి, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 3.30 శాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతోపాటు , చమురు ధరలు కొంత తగ్గు ముఖంపట్టడం ట్రేడర్లలో ఉత్సాహం నింపాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.08 శాతం తగ్గి బ్యారెల్‌కు74.45 కి చేరింది. షాంఘై, టోక్యో, సియోల్ వంటి ఆసియా మార్కెట్లు నష్టాలు పాలయ్యాయి. మంగళవారం ఎఫ్‌ఐఐలు రూ. 237.47 కోట్ల అమ్మకాలు సాగించగా, డీఐఐలు రూ. 198.35 కోట్ల మేర కొనుగోళ్లు జరిపాయి. బుధవారం డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 21 పైసలు తగ్గింది.