- జేఎన్టీయూ, ఓయూకు నిర్వహణ బాధ్యతలు
- గైడ్‌లైన్స్‌పై త్వరలోనే ఉన్నత విద్యా మండలి క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కామన్ పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ చర్యలు మొదలుపెట్టింది. వచ్చే విద్యాసంవత్సరం దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ముందుగా ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని అనుకున్నప్పటికీ.. గైడ్ లైన్స్ రూపొందించకపోవడంతో వాయిదా వేసినట్టు తెలిసింది. అయితే కామన్ పీహెచ్డీ నోటిఫికేషన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో యూజీసీ నిబంధనల ప్రకారం వర్సిటీలవారీగా పీహెచ్డీ నోటిఫికేషన్లు జారీచేశారు. పోయిన విద్యాసంవత్సరంలోనే ఓయూ, కేయూ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీలతో పాటు జేఎన్టీయూలో పీహెచ్డీ సీట్లను కామన్ ఎంట్రెన్స్ టెస్టు ద్వారా భర్తీ చేయాలని ఉన్నత విద్యామండలి భావించింది. ఇందులో భాగంగా ఓయూలో కాలపరిమితి ముగిసినా పీహెచ్డీ థీసిస్ సబ్మిట్ చేయని అభ్యర్థుల అడ్మిషన్లు రద్దు చేశారు. ఈ క్రమంలోనే కరోనాతో పాటు సీట్ల భర్తీపై ఆందోళనలు రావడంతో అధికారులు వెనక్కి తగ్గారు. కరోనా తర్వాత 2020లో జేఎన్టీయూ, 2021 డిసెంబర్ లో కేయూ, ఈ ఏడాది ఓయూ పీహెచ్డీ నోటిఫికేషన్లు జారీ చేశాయి. జేఎ న్టీయూ మరోసారి నోటిఫికేషన్ ఇచ్చేందుకూ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది కామన్ పీహెచ్ డీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు వర్సిటీ పెద్దలకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే దానిపై వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.
ఓయూ, జేఎన్టీయూలకు నిర్వహణ బాధ్యతలు
కామన్ పీహెచ్డీ నోటిఫికేషన్‌కు గైడ్‌లైన్స్ పై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. పలుదఫాలుగా వర్సిటీల వీసీలు, ఇతర విద్యాశాఖ అధికారులతో ఇప్పటికే చర్చలు చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ సబ్జెక్టులు జేఎన్టీయూకు, జనరల్ సబ్జెక్టుల్లో ఎంట్రెన్స్ నిర్వహించేలా ఓయూకు బాధ్యతలు అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, కామన్ నోటిఫికేషన్‌తో వర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందనే విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు పేరుతో కామన్ విధానంతోనే సీట్లను భర్తీ చేస్తున్నారు. తెలంగాణలోనూ అదే విధానాన్ని అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
