ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే జీవిత భాగస్వామితో సంతోషాల్ని పంచుకోవడం, నచ్చినంత సేపు కబుర్లు చెప్పుకోవడం అంటే ఎవరికైనా ఇష్టమే. అయితే... కొంతమంది మాత్రం వాళ్లను విడిచి క్షణం కూడా ఉండలేరు. ఎప్పుడూ పక్కనే ఉండాలి అనుకుంటారు. ఫ్రెండ్స్, పార్ట్నర్ కొంచెం సేపు కనిపించకున్నా తెగ కంగారు పడతారు. దీన్నే ‘సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్’ అంటారు. వీళ్ల ప్రవర్తన అవతలివాళ్లను ఇబ్బంది పెట్టడమే కాకుండా వాళ్ల మధ్య అనుబంధాన్ని దెబ్బతీస్తుంది అంటున్నారు సైకోథెరపిస్ట్‌లు.
సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నవాళ్లు... దగ్గరివాళ్లకు దూరంగా ఉండాలన్నా, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలన్నా భయపడతారు. ఇష్టమైన వాళ్లని విడిచి వెళ్తే వాళ్లకు ఏమవుతుందోననే భయం, వాళ్లు దూరమవుతారేమోననే టెన్షన్ ఉంటుంది. ఇలా అనిపించడం సాధారణమే అనిపించొచ్చు. కానీ, ఈ ప్రవర్తన అవతలివాళ్లకు విసుగు తెప్పిస్తుంది. మామూలుగా ఈ సమస్య పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తుంది. అయితే.. ఈమధ్య కొంతమంది పెద్దవాళ్లు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీళ్లు పార్ట్నర్, ఫ్రెండ్స్‌ని కంట్రోల్ చేయాలనుకుంటారు. అంతేకాకుండా వాళ్లతో ఎవరైనా చనువుగా ఉంటే తట్టుకోలేరు.
ఏం చేయాలంటే...
అనుబంధాల మధ్య దూరాన్ని పెంచే ఈ సమస్యకు కారణాలేంటో తెలుసుకోవాలి. చిన్నప్పటి అనుభవాలు, జెనెటిక్ సమస్యలతో పాటు ఆతృత, భయం వంటివి సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్‌కి ప్రధాన కారణం అంటున్నారు సైకోథెరపిస్ట్‌లు. బాగా గారాబం చేయడం, అతి జాగ్రత్తగా పెంచడం వల్ల పిల్లల్లో సెపరేషన్ యాంగ్జైటీ కనిపిస్తుంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 4 శాతం మంది పెద్దవాళ్లు కూడా సెపరేటివ్ యాంగ్జైటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారని రీసెర్చ్‌లో తేలింది” అంటోంది చాందినీ అనే సైకోథెరపిస్ట్.
బయటపడాలంటే...
పార్ట్నర్ లేదా ఫ్రెండ్ ఈ సమస్యతో ఉన్నట్టు గమనిస్తే వాళ్లను వెంటనే సైకోథెరపిస్ట్కి చూపించాలి. యాంగ్జైటీ డిజార్డర్ ఎక్స్‌పర్ట్‌కి చూపించినా ఓకే. సైకో థెరపీ ట్రీట్మెంట్ ద్వారా సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ నుంచి బయటపడొచ్చు. కొన్నిసార్లు థెరపీతో పాటు మందులు వాడాల్సి ఉంటుంది. టాక్ థెరపీ లేదా సైకలాజికల్ కౌన్సెలింగ్ ఇప్పిస్తే సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ లక్షణాలు తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం, యోగా వంటివి చేయాలి.
