
న్యూఢిల్లీ: ఆర్బీఐ రాబోయే మానిటరీ పాలసీ మీటింగ్‌లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే సరైన నిర్ణయం అవుతుందని ఎస్‌బీఐ సోమవారం విడుదల చేసిన ఒక స్టడీ రిపోర్ట్ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది.
ఫిబ్రవరి నుంచి ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వరుసగా మూడు సార్లు రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ ఆగస్టులో విరామం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సెప్టెంబర్ 29న మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అక్టోబర్ 1న ప్రకటించనున్నారు.
సెప్టెంబర్‌లో రేటు కోతకు తగిన కారణాలు ఉన్నాయని, ఆర్బీఐ దీనిపై సరైన సమాచారం ఇవ్వడం అవసరమని ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం విడుదల చేసిన రిపోర్ట్ 'ప్రిల్యూడ్ టు ఎంపీసీ మీటింగ్' పేర్కొంది. సెప్టెంబర్ లో రేటు తగ్గించకపోతే తప్పు అవుతుందని, ఎందుకంటే 2027 ఆర్థిక సంవత్సరంలో కూడా ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంటుందని తెలిపింది.
జీఎస్టీలో కోత లేకపోయినా, సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ద్రవ్యోల్బణం 2 శాతం దిగువనే ఉందని పేర్కొంది. ఎస్‌బీఐ రిపోర్ట్ ప్రకారం, భారీ జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల 2027 ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం సుమారు 4 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది.