పోషకాలు దేహానికి రక్ష 

పోషకాలు దేహానికి రక్ష 
  • సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు

పోషకాహారం  ప్రాముఖ్యత గురించి ప్రజల్లో  చైతన్యం కలిగించడానికి, వారి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండేటట్లుగా ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుతుంది. ఈ వారోత్సవాలు 1982 నుంచి మొదలయ్యాయి. శరీరం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, మొదలైనవి ఉండాలి. వీటిలో కొన్ని గ్రాములలోను, మరికొన్ని మైక్రో గ్రాములలోను అవసరమవుతాయి. వీటిలో కొన్నిటిని అవసరమైన పరిమాణం కంటే తక్కువగా తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉండదు. ఇటువంటి పరిస్థితిని పోషకాహార లోపం అని అంటారు. 

ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిక స్థాయిలో పోషకాలు తీసుకోవడాన్ని (అధిక పోషణ ) కూడా పోషకాహార లోపం అని అంటారని తెలిపింది. అధిక పోషణ ఊబకాయం, మధుమేహం వంటి రోగాలకి కారకాలవుతాయి. పిల్లలు వయస్సు తగిన ఎత్తు లేకపోవడం, వయసుకు తగ్గ బరువు లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, రక్తములో హిమోగ్లోబిన్ స్థాయి  తక్కువగా ఉండడము వంటి లక్షణాలు కనిపిస్తే వారు పోషకాహారం లోపముతో ఉన్నారని గ్రహించాలి.

ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక ( ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ ) 10 జూలై 2023 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా  720 మిలియన్ల నుంచి 81 మిలియన్లు  మంది ప్రజలు సరైన తిండి లేకుండా జీవిస్తున్నారు. 2019వ సంవత్సరం కంటే వీరు 161 మిలియన్ల మంది ఎక్కువ. 2022లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 45 మిలియన్ల మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు, 148 మిలియన్ల మంది వయసుకు తగ్గ ఎత్తు, 37 మిలియన్లు మంది అధిక బరువు కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. 

 మన దేశంలో పోషకాహార లోపం

ఇక మన దేశంలో తీసుకుంటే   ప్రపంచంలోనే పోషకాహార లోపం ఉన్న పిల్లలలో మూడవ వంతు మనదేశంలోనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ( ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ ) ఐదు ప్రకారం మన దేశంలో 3 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. 19 శాతం ఎత్తుకు తగ్గ బరువు, 32 శాతం మంది వయసుకు తగ్గ బరువు లేరని తెలిపింది. అలాగే 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పురుషులలో 25 శాతం మంది, స్త్రీలలో 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో 50 ఏళ్ల లోపు పురుషులలో 16 శాతం, స్త్రీలలో 19 శాతం  మంది ఉన్నారు. మన జనాభాలో దాదాపు 40 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. రాష్ట్రాల పరంగా మహారాష్ట్ర తర్వాత బీహార్, గుజరాత్ లలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. మిజోరాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా  పోషకాహార లోప బాధితులు ఎక్కువగా ఉన్నారు.

దీనికి గల కారణాలను అన్వేషిస్తే పేదరికం అనేది ప్రధాన సమస్య. వీళ్ళ కుటుంబాలలో సంపాదన స్థాయి తక్కువగా ఉండడం వలన కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది. దీని కారణంతో వారు సంపూర్ణ ఆహారాన్ని తీసుకోలేరు. కొన్ని రకాల అంటువ్యాధులతో బాధపడుతున్న వారిలో,  జన్యులోప వ్యాధులుతో బాధ పడుతున్న వారిలో, పొట్టలో నులిపురుగులు ఉండే వారిలో  హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. అందువలన వీరు పోషకాహార లోపం ఎక్కువగా కనబడుతుంది.

సామాజికంగా సంపాదన ఎక్కువగా ఉన్ననూ వారు పాలీష్డ్ బియ్యం ఆహారంగా తీసుకోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వారిలో అధిక పోషణ లక్షణాలు అయిన ఊబకాయం, మధుమేహం వంటి లక్షణాలు కనబడతాయి.ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో బాలురపైన ఉండే శ్రద్ధ బాలికలపై లేకపోవడంతో బాలికల్లో పోషకాహార లోపం ఉంటుంది. మురికివాడలలో నివాసం ఉండేవారు, సంచార జాతులవారు పోషకాహార లోపానికి గురవుతున్నారు. అవగాహన లోపం వలన గర్భిణీలు, బాలింతలు సరైన పోషక విధానాలు పాటించకపోవడం కూడా పోషకాహార లోపానికి ఒక కారణం.

ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలి

ఇక మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లోపాన్ని తగ్గించడానికి చాలా కృషి  చేస్తున్నాయి. పిల్లలు యుక్త వయసులో ఉన్న బాలికలు మరియు స్త్రీలలో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ‘పోషణ్​ అభియాన్’ కార్యక్రమము, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను తీసుకువచ్చింది. అలాగే బాలింతలకు ఐసీడీఎస్ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిలో ఈ లోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.

గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు రక్తహీనతతో బాధపడుతున్న వారికి పోలిక్ యాసిడ్ ఐరన్ టాబ్లెట్స్ ను ఇస్తున్నారు. పాఠశాలల్లో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఈ లోపము నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరం ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలి. అప్పుడే ఐక్యరాజ్య సమితి లక్ష్యించిన విధంగా  2030 వ సంవత్సరానికి పోషకాహార లోపాన్ని మన దేశం నుంచి తరిమికొట్టవచ్చు.

- డి జె మోహన రావు,ఉపాధ్యాయుడు