ఇది రియల్​ రాజుగారి గది!

ఇది రియల్​ రాజుగారి గది!

మిస్టరీ మహల్​లో వరుస హత్యలు నందిగామ ప్రజలను హడలగొడుతున్నాయి. ఇప్పటికే ఆ మహల్​ 34 మందిని పొట్టనబెట్టుకున్నా ఈ హత్యలకు కారణమెవరో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మహల్​లో ఉన్న దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని నందిగామ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మహల్​ వైపు వెళ్లడానికి, కనీసం కన్నెత్తి చూడ్డానికి కూడా జంకుతున్నారు. జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్​ను వెంటనే సీజ్​ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ మహల్​ మిస్టరీని సొమ్ము చేసుకునేందుకు, టీఆర్​పీ రేటింగ్​ పెంచుకునేందుకు ఓ టీవీ చానల్​ రియాల్టీ షోను ప్లాన్ చేసి, ఆ మహల్​లో వారంరోజులు గడిపితే 3 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించడంతో తాము ధైర్యవంతులమని అనుకునేవారు, దెయ్యాలు లేవని నమ్మే ఓ బ్యాచ్​ ఆ మహల్​లోకి వెళ్తోంది. ఆగండాగండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో మేం చెప్తాం. మేమేంటి, ‘రాజుగారి గది’ సినిమాచూసినవారు ఎవరైనా చెప్తారంటారా?

నిజమే.. మనం పైన చెప్పుకున్నదంతా ‘రాజుగారి గది’ సినిమా కథే. అయితే అందులో కనిపించేది ‘రీల్​ రాజుగారి గది’. మరి మీకు ‘రియల్​ రాజుగారి గది’ గురించి తెలుసా? ఇందులో వారం రోజులు గడపాల్సిన పనిలేదు. ఓసారి మొత్తం తిరిగొస్తే చాలు.. ఏకంగా 14 లక్షల రూపాయలను బహుమతిగా అందుకోవచ్చు. వెళ్లే ఇంట్రెస్ట్​ ఏమైనా ఉందా? అయితే ఈ రియల్​ రాజుగారి గది గురించి తెలుసుకోండి మరి..

హంటెడ్​ హౌస్​ కాన్సెప్ట్​ గురించి మనందరికీ తెలుసు. షాపింగ్​ మాల్స్​లో, ఎగ్జిబిషన్లలో అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తుంటారు. ఆ హౌస్​లోకి వెళ్లి.. చీకట్లో నడుస్తుంటే.. వచ్చే శబ్దాలు, సడెన్‌‌‌‌గా మీదకు వచ్చే దెయ్యం ఆకారాలు.. భలే భయపెడతాయి. అయితే ఇదంతా జస్ట్​ ఫర్​ ఫన్. పిల్లల్ని ఎంటర్​టైన్​ చేయడం కోసం ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. కానీ అమెరికాలో ఉన్న ‘మెక్కామీ మనోర్ హంట్‌‌‌‌’లో అడుగుపెడితే.. ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందే. ఆ భూతాల కొంపలోకి వెళ్లి అంతా ఓసారి తిరిగేసి వస్తే.. మీరే వీరులు. అందుకు నజరానాగా 14 లక్షల రూపాయలు ప్రైజ్​మనీ ఇస్తారు. ఒకవేళ భయపడి మధ్యలోనే బయటకు వస్తే మీకు మిగిలేది భయంకరమైన అనుభవమే.

సాధారణంగా హంటెడ్​ హౌస్​లోకి అడుగుపెట్టాలంటే ఎంతోకొంత చెల్లించాలి. మరి భారీగా ప్రైజ్​ మనీ ఇస్తున్న ‘మెక్కామీ మనోర్ హంట్‌‌‌‌’లోకి అడుగుపెట్టాలంటే కూడా భారీమొత్తాన్ని చెల్లించాలేమో అనుకుంటున్నారా? అబ్బే.. ఏం అక్కర్లేదు. ఐదు కుక్కలకు సరిపడా డాగ్ ఫుడ్ తీసుకెళ్తే చాలు. అయితే.. అందులోకి వెళ్లిన తర్వాత తిరిగి రావడమే పెద్ద సవాల్. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత భయానికి గురిచేసే ఏకైక హాంటెడ్ హౌస్ ‘మెక్కామీ మనోర్ హంట్‌‌‌‌’ మాత్రమే.

ఎందుకంటే.. ఇందులో దెయ్యాల కంటే ఉన్మాదులే ఎక్కువగా ఉంటారు. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల్లో లాంటి క్యారెక్టర్స్​ అందులోకి వెళ్లినవారిని దారుణంగా హింసిస్తాయి. పాములు, సాలీడులు, పురుగులు.. ఇంకా ఎన్నో ఈ ఇంట్లో ఉంటాయి.

కండిషన్స్​ అప్లయ్​..

ఈ దెయ్యాల కొంపలోకి వెళ్లాలంటే కొన్ని టర్మ్స్​ అండ్​ కండిషన్స్​ ఉన్నాయి. వెళ్లాలనుకునేవారు కంపల్సరీగా డాక్టర్​ సర్టిఫికెట్​ తెచ్చుకోవాలి. మెంటల్​గా, ఫిజికల్​గా హెల్దీగా ఉన్నారని డాక్టర్​ ధ్రువీకరించాలి. అంతేకాదు.. ఎలాంటి క్రిమినల్​ బ్యాక్​గ్రౌండ్​ కూడా ఉండొద్దు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఎంతగా హింసించినా ఎటువంటి కేసులు పెట్టబోమని ఓ హామీ పత్రం కూడా రాసివ్వాలి. అందులో ఏం జరిగినా నిర్వాహకులు బాధ్యులు కాదని సంతకం పెట్టాలి. 18 ఏళ్ల లోపు టీనేజర్లకు ప్రవేశం లేదు. 18 నుంచి 20 ఏళ్ల లోపు యువతీ యువకులు తప్పకుండా వారి తల్లిదండ్రుల అనుమతి పొందాలి. ఇలా మొత్తం 40 పేజీల కండిషన్స్​కు ఒప్పుకుంటేనే ‘మెక్కామీ మనోర్ హంట్‌‌‌‌’లోకి వెళ్లొచ్చు.

టార్చర్​ మామూలుగా ఉండదు..

‘మెక్​ క్యామీ మనోర్ హంట్‌‌‌‌’లోకి అడుగు పెట్టగానే అందులో ఉండే ఉన్మాదులు పెట్టే టార్చర్​ మామూలుగా ఉండదు. చీకటి గదిలో బంధించి పాములు, తేళ్లు, జెర్రిలను వదులుతారు. నీళ్లలో ముంచుతారు.. శరీరాన్ని హూనం చేస్తారు. అగాథాల్లోకి తోసేస్తారు. అయితే వారిని ఎదుర్కోవచ్చు. అందుకు మనలో ఎంతో స్టామినా ఉండాలి. ఈ టార్చర్​ను దాటి ముందుకు వెళ్తే.. తలకు ఐరన్​ బాక్స్​లను బిగించి, అందులోకి పాముల్ని వదులుతారు. అఫ్​కోర్స్​ అవి విషసర్పాలు కావనుకోండి. అయినా వాటిని తట్టుకొని ఆ బాక్స్​ను బద్దలు కొట్టుకొని నెక్స్ట్​ డోర్​ తెరుచుకొని ముందుకు వెళ్లాలి. ఇలా రకరకాల టార్చర్లను దాటి బయటకు వచ్చినవాళ్లు మాత్రమే విన్నర్స్​.

తొమ్మిదేళ్లలో ఒక్కరు కూడా గెలవలేదు..

తొమ్మిదేళ్లుగా ‘మెక్​ క్యామీ మనోర్ హంట్‌‌‌‌’ ను నడుపుతున్నా. ఇప్పటిదాకా ఒక్కరు కూడా గెలవలేదు. ఇది ఒక గేమ్ లాంటిది. మానసికంగా బలంగా ఉన్నవాళ్లు మాత్రమే విన్​ అవుతారు. పాత కాలం నాటి హారర్​ సినిమాల ఆధారంగా ఈ హాంటెడ్ హౌస్ నిర్మించాను. కొన్ని లక్షల డాలర్లు ఖర్చుపెట్టాను. ఇది నేను ప్రజలకు విసురుతున్న ఓ సవాల్ అనుకోవచ్చు. ఇందులో లైటింగ్, సౌండ్లు అన్నీ భయానకంగానే ఉంటాయి. హారర్​ సినిమాలో మీరే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ హౌస్ నడిపేందుకు నాకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది అధికారికంగా హింసించే ఇల్లు. ఒకవేళ మీరు ధైర్యవంతులైతే నా యూట్యూబ్​ చానల్​ కింద ఉండే లింక్​ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

‌‌‌‌‌‌‌‌– హారస్ మెక్కామీ, మెక్​ క్యామీ మనోర్ హంట్‌‌‌‌ హౌస్​ యజమాని