డ్వాక్రా మహిళలకు రూ.2 లక్షల పర్సనల్ లోన్

డ్వాక్రా మహిళలకు రూ.2 లక్షల పర్సనల్ లోన్
  • 92 వేల మందికి రూ.2 లక్షల చొప్పున ఇవ్వాలని సెర్ప్ టార్గెట్
  • కొనసాగుతున్న లబ్ధిదారుల ఎంపిక 

హైదరాబాద్, వెలుగు: మహిళా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా  గ్రూపులవారీగా రుణాలు అందిస్తున్న  సెర్ప్​.. ఇక మీదట వారికి వ్యక్తిగతంగానూ లోన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. గ్రామాల్లో కొత్తగా కిరాణాషాపులు, ఇతర దుకాణాలు, వ్యాపారాలు నిర్వహించాలనుకునే మహిళలకు ఒక్కొక్కరికి రూపాయి వడ్డీకే రూ.2 లక్షల రుణ సాయం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డ్వాక్రా గ్రూపులో కనీసం మూడేండ్ల సీనియార్టీ ఉండి, పాత లోన్లకు సంబంధించిన కిస్తీలను రెగ్యులర్​గా చెల్లించే మహిళలను అర్హులుగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. గత ఏడాది కూడా వ్యాపారంలో ఆసక్తి ఉన్న మహిళలకు రుణాలు అందించినప్పటికీ.. ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.లక్షకు మించి లోన్ ఇవ్వలేదు. అయితే ఈ సారి రుణసాయాన్ని డబుల్ చేయడం విశేషం. 

గ్రూపు సభ్యులంతా ఓకే అంటేనే..

రాష్ట్రవ్యాప్తంగా 18,405 గ్రామైక్య సంఘాల పరిధిలో 3.99 లక్షల డ్వాక్రా గ్రూపులున్నాయి. ఇందులో ఒక్కో గ్రామైక్య సంఘం పరిధిలో ఐదుగురు మహిళలకు  రుణ సాయం అందించబోతున్నారు. నిరుడు రూ.లక్ష వరకు రుణం తీసుకుని 35 వేల మంది వ్యాపారాలు ప్రారంభించారు. వారంతా సక్సెస్​ ఫుల్​గా కిస్తీలు కడుతుండడంతో  ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 92 వేల మంది మహిళలకు‌‌ రుణాలివ్వాలని సెర్ప్  టార్గెట్​గా పెట్టుకుంది. ఇందుకోసం ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు, అర్హుల గుర్తింపు ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. గ్రూపులో ఒక మహిళకే ఈ లోన్​ ఇచ్చినప్పటికీ.. మిగతా గ్రూపు సభ్యులంతా అందుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.