సెర్ప్ ఉద్యోగులకు జీతాలు పడలె

సెర్ప్ ఉద్యోగులకు జీతాలు పడలె
  • పండుగ పూట తప్పని ఇబ్బందులు
  • నాలుగు వేల మంది ఎదురుచూపు

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు ఈ నెల 12 తారీకొచ్చినా జీతాలు పడలేదు. సెర్ప్​ సీఈవో మారినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉందని, కుటుంబ అవసరాలకు ప్రతి నెలా  అప్పులు చేయాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం శాలరీలు పడకుంటే పండుగ సెలవుల కారణంగా సోమవారం దాకా ఆగాల్సి వస్తుందని చెప్తున్నారు. సెర్ప్​లో పనిచేస్తున్న 4 వేల మంది ఉద్యోగుల జీతాలకు  రూ.14 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంటున్నారు. 

అడ్వాన్స్​ అండ్ అడ్జస్ట్​మెంట్ పద్ధతి తీసేశారు..

ఏడాదిన్నర క్రితం వరకు ప్రతి నెలా 5వ తేదీలోపు అడ్వాన్స్ అండ్ అడ్జస్ట్ మెంట్ పద్ధతి ప్రకారం సెర్ప్ లో జీతాలు ఇచ్చేవారు. సెర్ప్​లో ఉన్న నిధులను ఉద్యోగుల శాలరీ కోసం అడ్జస్ట్ చేసి.. ఆ తర్వాత ప్రభుత్వం చెక్కులు జమ చేయగానే సెర్ప్ అవసరాలకు వాడేవారు. ఈ పద్ధతిని అమలు చేయకపోవడంతో ఉద్యోగుల జీతం ప్రతి నెలా ఆలస్యమవుతోంది. దసరా, సంక్రాంతి పండుగలపుడు జీతాలు లేట్ కావడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.