పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం

పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం
  • మరో ఆరు నెలల్లో అందుబాటులోకి కొవొవ్యాక్స్

కరోనా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికే పెద్దలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. అది వేసుకున్న వాళ్లకూ వైరస్ సోకుతోంది. అయితే వైరస్ బారినపడినప్పటికీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడంతో పాటు చనిపోయే ముప్పు కూడా తగ్గుతోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందోనని జనం నిరీక్షిస్తున్నారు. పలు కంపెనీలు రెండేళ్లు, మరికొన్ని కంపెనీలు మూడేళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయోగాలు, ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ మూడేళ్లు పైబడిన పిల్లల కోసం మరో ఆరు నెలల్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ సీఈవో ఆదర్ పూనావాలా వెల్లడించారు. ఇవాళ (మంగళవారం) జరిగిన సీఐఐ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం

కొవొవ్యాక్స్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే పిల్లలపై ప్రయోగాలు చేశామని, ఈ వ్యాక్సిన్ మూడేళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వేయొచ్చని ఆదర్ పూనావాలా చెప్పారు. మూడేళ్లు పైబడిన వారందరికీ ఈ వ్యాక్సిన్ వేయడం ద్వారా కరోనా నుంచి ప్రొటెక్షన్ లభిస్తుందని, ఎవరికీ ఎటువంటి హాని ఉండదని తమ ట్రయల్స్ డేటా ద్వారా తేలిందని వివరించారు. ప్రస్తుతం పిల్లలపై కరోనా అంత తీవ్ర ప్రభావమేమీ చూడపం లేదని, అయినప్పటికీ మరో ఆరు నెలల్లోనే తాము పిల్లల కోసం కొవొవ్యాక్స్‌ కొవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నానని తెలిపారు. పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమని అన్నారు. పెద్దలతో పాటు పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయించాలని, ఈ వ్యాక్సిన్ల వల్ల ఎటువంటి హాని జరగదని ఆదర్ పూనావాలా సూచించారు. మరో రెండు కంపెనీలు కూడా త్వరలోనే పిల్లలపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్ చేస్తున్నాయని చెప్పారు. కాగా, సీరం కంపెనీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి డెవలప్‌ చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 18 ఏండ్లు పైబడిన వారికి అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడు మూడేళ్లు పైబడిన వారి కోసం కొవొవ్యాక్స్‌ టీకాను అందుబాటులోకి తీసుకురాబోతోంది.