20 రోజుల పాటు పార్లమెంట్ సెషన్స్

20 రోజుల పాటు పార్లమెంట్ సెషన్స్

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటు వింటర్ సెషన్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు సమావేశాలు జరగనున్నాయి. దాదాపు 20 రోజుల పాటు సాగనున్న ఈ సమావేశాల్లో 8 కీలక బిల్లులను కేంద్రం ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. ఈ సెషన్ లో తొలిరోజు అగ్రిచట్టాల రద్దు బిల్లుతో సహా సుమారు 26 బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన లిస్ట్ ను రెడీ చేసింది. ఇందులో ఇటీవల ప్రభుత్వం తెచ్చిన 3 ఆర్డినెన్స్‌‌లు ఉన్నాయి. 26 బిల్లుల్లో బ్యాంకింగ్‌‌ చట్టసవరణ బిల్లు ఉంది. బ్యాంకులను ప్రైవేటుపరం చేసే బిల్లు పార్లమెంట్‌‌ ముందుకు రానుంది. పెన్షన్‌‌ ఫండ్‌‌ రెగ్యులేటరీ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ చట్ట సవరణ బిల్లును కూడా కేంద్రం ప్రవేశ పెట్టనుంది. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా ‘విత్తనాలపై బిల్లు’, విద్యుత్తు సవరణ బిల్లు ను పార్లమెంటు ఆమోదానికి తీసుకురానుంది. అమ్మాయిలను వ్యభిచారంలోకి దించకుండా అడ్డుకునే యాంటీ ట్రాఫికింగ్ బిల్లు–2021 కూడా పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్​, నార్కోటిక్‌‌ డ్రగ్స్‌‌పై తెచ్చిన ఆర్డినెన్స్‌‌ స్థానంలో బిల్లు కూడా సభ ముందుకు రానుంది. 

నేడు ఆల్ పార్టీ మీటింగ్  
పార్లమెంటులో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మీటింగ్ జరగనుంది.  కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మీటింగ్ లో సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్ సహా పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. లోక్ సభ స్పీకర్, రాజ్య సభ చైర్మన్ ల నేతృత్వంలో కూడా వేరు వేరుగా ఆల్ పార్టీ మీటింగ్ లు జరగనున్నాయి. సభ సజావుగా సాగేలా ప్రతి ఒక్క సభ్యుడు సహకరించాలని కోరనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా జరగనుంది.  మీటింగ్ కు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు. అగ్రి చట్టాల రద్దు సందర్భంగా ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ మీటింగ్ లో మోడీ ఎంపీలకు సూచనలు చేయనున్నారు.