
ఒడిశాలోని పూరీలో జగన్నాథ ఆలయంలో జరిగిన రథయాత్ర అనంతరం అపశృతి చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో బలభద్ర స్వామి విగ్రహం పల్లకిపై నుంచి పడటంతో ఏడుగురు సేవకులు గాయపడ్డారు. జూలై9న సాయంత్రం మూడు విగ్రహాలను రథాలపై నుంచి గుండిచా ఆలయంలోని అడపా మండపానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇతర కర్మలు పూర్తైన తర్వాత విగ్రహాల పహండి ప్రారంభమైంది. అక్కడ మూడు విగ్రహాలను సేవకులు మెల్లగా ఊపుతూ అడపా మండపానికి తీసుకువెళుతున్నారు. తాళధ్వజ రథంపై నుంచి బలభద్ర స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తున్నప్పుడు విగ్రహం ఒక్కసారిగా రథం పై నుంచి జారి సేవకులపై పడింది. విగ్రహాన్ని మోస్తున్న ఏడుగురు సేవకులకు గాయాలు అయ్యాయి.