బిహార్​ గుడిలో తొక్కిసలాట ఏడుగురు దుర్మరణం

బిహార్​ గుడిలో తొక్కిసలాట ఏడుగురు దుర్మరణం
  • 16 మందికి గాయాలు.. మృతుల్లో ఆరుగురు మహిళలు
  • బాబా సిద్దేశ్వర్​నాథ్ ఆలయం వద్ద దుర్ఘటన
  • భక్తులపై లాఠీచార్జ్ చేయడమే కారణమంటున్న బాధితులు

జెహనాబాద్: బిహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లాలోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆలయం వద్ద తొక్కిసలాట జరిగిందని కలెక్టర్ అలంకృత పాండే చెప్పారు. ఆలయం వెలుపల ఉన్న భక్తుల సమూహం, పూల విక్రయదారుల మధ్య గొడవ జరిగిందని.. ఈ సందర్భంగా కొంత మంది సిబ్బంది లాఠీచార్జ్​ చేయడం తొక్కిసలాటకు కారణమై ఉండవచ్చని స్థానికులు చెప్పారన్నారు.

అయితే తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని, కచ్చితమైన కారణమేంటనేది త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. ఈ దుర్ఘటనకు అక్కడున్న ఎన్​సీసీ (నేషనల్ క్యాడెట్ కార్ప్స్) వలంటీర్లు లాఠీచార్జ్ చేయడమే కారణమని బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ‘‘నిర్వహణ ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగింది. క్రౌడ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిమగ్నమైన కొంతమంది ఎన్​సీసీ వలంటీర్లు భక్తులపై లాఠీలు ప్రయోగించారు.

ఇది తొక్కిసలాటకు దారితీసింది” అని మృతుల బంధువులు మీడియాతో చెప్పారు. ఈ ఘటనపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరోవైపు, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.