ఏడు పులి పిల్లలు.. వరసగా చనిపోయాయి.. ఈ వైరస్ అంత ప్రమాదకరమా..!

ఏడు పులి పిల్లలు.. వరసగా చనిపోయాయి.. ఈ వైరస్ అంత ప్రమాదకరమా..!

పులి.. వన్యప్రాణి సంరక్షణ కింద ఎన్నో చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే బెంగళూరులోని బన్నెరఘట్ట బయోలాజికల్ పార్కులో వరసగా.. ఏడు పులి పిల్లలు చనిపోవటం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించటంతో వెలుగులోకి వచ్చింది. ఏడు పులి పిల్లలు చనిపోవటానికి కారణం.. వైరస్ అంటున్నారు అధికారులు. పిల్ల జాతికి చెందిన ఫెలైన్ ఫాన్ల్యూకోపెనియా అనే పిల్లి జాతికి చెందిన వైరస్ సోకటం వల్ల.. ఈ దారుణం జరిగిందనేది అధికారుల వెర్షన్. 

 

Also Read : Health Tip : ఉప్పుతో అనారోగ్యం అని ఫీలవుతున్నారా.. ఉప్పు బదులుగా ఇవి వాడండి

పార్కులో వైరస్ సోకినట్లు గుర్తించిన వెంటనే పులి పిల్లలకు చికిత్స ప్రారంభించామని.. అయినా వాటిని కాపాడలేకపోయినట్లు వివరించారు పార్కు అధికారులు. వైరస్ సోకిన పులి పిల్లలను వేరుగా ఉంచామని.. మిగతా జంతువులకు ఈ వైరస్ సోకకుండా దూరంగా ఉంచామని.. అయినా ఫలితం లేదనేది వారి వాదన. పులి పిల్లలు పుట్టిన వెంటనే వ్యాక్సిన్లు వేశామని.. అయినా వైరస్ బారి నుంచి కాపాడలేకపోయినట్లు చెబుతున్నారు అధికారులు. 

2023, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 15వ తేదీ మధ్య కాలంలో.. ఈ 15 రోజుల్లోనే ఏడు పులి పిల్లలు చనిపోయాయని.. ప్రస్తుతం పార్కులో ఉన్న మిగతా పులి పిల్లలు సురక్షితంగా.. క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. మరో రెండు పులి పిల్లలకు కూడా వైరస్ సోకిందని.. వాటికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఫెలైన్ పాన్ల్యూకోపెనియా వైరస్ అంటే ఏంటీ.. ఏం జరుగుతుంది..?

ఈ వైరస్ సోకిన పులులకు ప్రేగు మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది. దీని వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. ఎలాంటి ఆహారం తీసుకోలేవు. మంచినీళ్లు కూడా తాగలేవు. దీని వల్ల వేగంగా నీరసించటంతోపాటు.. నాలుగు, ఐదు రోజుల్లోనే చనిపోయాయి జంతువులు. ఈ వైరస్ ఇప్పుడు పులి పిల్లలకు సోకినట్లు వెల్లడించారు బయోలాజికల్ పార్కు అధికారులు. 

బెంగళూరు పార్కులో ఏడు పులి పిల్లల మరణం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని.. ఇప్పుడే జరగటం వెనక అధికారుల నిర్లక్ష్యం ఉందనే వాదనలు, విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి.