మన నేవీ మాజీ అధికారులకు..ఖతార్​లో తప్పిన ఉరిశిక్ష

మన నేవీ మాజీ అధికారులకు..ఖతార్​లో తప్పిన ఉరిశిక్ష
  •  కేంద్రం చొరవతో ఢిల్లీ చేరుకున్న ఏడుగురు ఆఫీసర్లు

న్యూఢిల్లీ : ఖతార్‌‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన 8 మంది భారత నావికాదళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. 18 నెలలుగా అక్కడి జైలులో ఉంటున్న ఆఫీసర్లు ఎట్టకేలకు రిలీజ్​అయ్యారు. ఏడుగురు ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా మరో వ్యక్తి త్వరలో  రానున్నారు. ఈ మేరకు ఖతార్‌‌ ప్రభుత్వం నిర్ణయాన్ని భారత్​ స్వాగతించింది. ‘‘దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తూ ఖతార్‌‌లో అరెస్టయిన 8 మంది భారతీయులను విడుదల చేస్తూ ‘ఎమిర్ ఆఫ్‌‌ ది స్టేట్‌‌ ఆఫ్‌‌ ఖతార్‌‌’ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఉదయం ప్రకటన విడుదల చేసింది.

2022లో అరెస్ట్..

గూఢచర్యం ఆరోపణల కింద ఎనిమిది మంది ఇండియన్ ​నేవీ మాజీ అధికారులను 2022లో ఖతార్‌‌ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కెప్టెన్లు సౌరభ్‌‌ వశిష్ట్, నవతేజ్‌‌ గిల్‌‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌‌ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌‌ పాకాల, సంజీవ్‌‌ గుప్తా, అమిత్‌‌ నాగ్‌‌పాల్‌‌, సెయిలర్‌‌ రాగేశ్‌‌ ఉన్నారు. అక్కడి ప్రాథమిక కోర్టు విచారణ జరిపి వారికి మరణ శిక్ష విధించింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా ప్రయత్నాలు చేయగా, అప్పీలుకు అక్కడి కోర్టు అనుమతించింది. పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది డిసెంబర్​28న మరణ శిక్షను సాధారణ జైలు శిక్షగా మారుస్తూ తీర్పు ఇచ్చింది. 

ఈ తీర్పుపైనా అప్పీలుకు 60 రోజుల గడువు ఇవ్వడంతో భారత విదేశాంగ వారి విడుదలకు ఉన్న అన్ని న్యాయమార్గాలను వెతికింది. అవన్నీ ఫలించడంతో ఎనిమిది మంది అధికారుల్లో ఒక్కరు మినహా మిగతా వారు ఇండియాకు తిరిగి వచ్చారు.  భారత ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు, ప్రత్యేకంగా ప్రధాని మోదీ చొరవ వల్లే తమ విడుదల సాధ్యమైందని ఢిల్లీకి చేరుకున్న నేవీ మాజీ అధికారులు తెలిపారు. 

ఈ నెల 14న ఖతార్​కు మోదీ

13, 14వ తేదీల్లో యునైటెడ్‌‌ అరబ్‌‌ ఎమిరేట్స్‌‌లో పర్యటించనున్న ప్రధాని.. అక్కడినుంచి దోహాకు వెళ్తారని విదేశాంగ కార్యదర్శి వినయ్‌‌ మోహన్‌‌ క్వాత్రా సోమవారం ప్రకటించారు. ‘‘ప్రధాని మోదీ ఈ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. మాజీ అధికారుల విడుదల ఆయన నాయకత్వానికి నిదర్శనం. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రతిబింబిస్తుంది. పర్యటనలో భాగంగా ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖతార్‌‌లో ప్రధాని మోదీకి ఇది రెండో పర్యటన’’ అని తెలిపారు.