
మంగపేట/చొప్పదండి/చండ్రుగొండ/నార్కెట్ పల్లి/గూడూరు/వీణవంక/జ్యోతినగర్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుండడంతో జనం అల్లాడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఎండ దెబ్బకు ఏడుగురు చనిపోయారు. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటలో వడదెబ్బతో దామెర రాంబాబు(50) మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా బసం త్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కరీంనగర్ జిల్లా చొప్పదండికి సిమెంటు లోడు తీసుకొచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ జాకీర్ హుస్సేన్(60) మృతిచెందాడు.
ఎండ వేడిమిని తట్టుకోలేక అస్వస్థతకు గురై లారీని జడ్పీ బాయ్స్ హై స్కూల్ ముందు రోడ్డు పక్కన నిలిపి వేప చెట్టు కింద కూర్చొని అక్కడే ప్రాణాలొదిలాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన కల్యాణం రామక్క(75) వారం రోజులుగా ఎండలతో అస్వస్థతకు గురై.. చికిత్సపొందుతూ శుక్రవారం సాయంత్రం చనిపోయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ బస్టాండ్ సమీపంలోని ఊరచెర్వు గట్టు వద్ద చుంచుపల్లి మండలం గరిమెళ్ళపాడు గ్రామానికి చెందిన కర్రీ పాపారావు(55) ఎండల వేడిని తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతి చెందాడు.
కూలి పనులకు వెళ్లి..
నల్గొండ జిల్లా చిట్యాల టౌన్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన మేస్త్రీ కర్రీ రాజు( 48) శుక్రవారం బస్టాండ్ వద్దకు వచ్చి వడదెబ్బతో అస్వస్థతకు గురై చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని ఎస్సీ కాలనీకి చెందిన జన్ను ఎల్లమ్మ( 65) రెండు రోజుల క్రితం కూలి పనులకు వెళ్లి వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ ప్రాంతానికి చెందిన ఈదునూరి కిశోర్ (38).. హనుమాన్ మాలధారులతో కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లి ధర్మారం మండలం రాజరాంపల్లి వద్ద సొమ్మసిల్లి పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తుండగా దారిలో చనిపోయాడు.