TRS కు ఆ ఏడు సీట్లు కీలకం

TRS కు ఆ ఏడు సీట్లు కీలకం

ఆ ఏడు సీట్లు TRS కు కీలకంగా మారాయి.  16 ఎంపీ సీట్లలో పాగా వేయాలని భావిస్తున్న టీఆర్ఎస్ కు ఈ సీట్లలో గెలుపు కీలకంగా మారింది. ప్రతిపక్షాల ఆశలు కూడా ఈ ఏడు సీట్లే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. సర్వేల్లో కూడా ఈ 7 నియోజకవర్గాల్లో TRS అభ్యర్థులపై డిఫరెంట్ ఒపీనియన్ రావటంతో… పార్టీ సీనియర్లను రంగంలోకి దింపింది టీఆర్ఎస్ అధిష్టానం.

లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లే టార్గెట్ గా పనిచేస్తుంది గులాబీ పార్టీ. అన్ని సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని  భావిస్తుంది అధికార పార్టీ. అయితే కొన్ని నియోజక వర్గాల్లో గెలుపు ఈజీగా కనిపిస్తున్నా.. మరికొన్ని చోట్ల ప్రత్యర్థులు బలంగా ఉండటం టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. 7 నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ కు ధీటుగా ప్రచారం చేస్తున్నాయి… విపక్షాలు. దీంతో ఈ స్థానాలపై గులాబీ హైకమాండ్ సీరియస్ గా ఫోకస్ చేసింది.

సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్ గిరి, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్ లోక్ సభ నియోజక వర్గాల్లో గెలుపు టీఆర్ఎస్ కు కీలకంగా మారింది. చేవెళ్ళ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీలో ఉండటంతో ఇక్కడ TRS కు గెలుపు అంత ఈజీ కాదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొండా లోకల్ అభ్యర్థి కావటం… టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి రాజకీయాలకు కొత్త వ్యక్తి కావటంతో పాటు నాన్ లోకల్ క్యాండెట్ అని… స్థానికంగా చర్చ జరుగుతుంది. తాండూరు నియోజక వర్గం మినహా…. మిగతా ఆరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటం … అధికార పార్టీకి కలిసి వచ్చే అంశం. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు బల్దియా మేయర్ బొంతు రాంమ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రంగంలోకి దింపింది టీఆర్ఎస్.

సికింద్రాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. అధికార పార్టీ నుంచి మంత్రి తలసాని కొడుకు సాయికిరణ్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ నుంచి సీనియర్ నేత కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీకి సిట్టింగ్ సీటు కావటం… కిషన్ రెడ్డి పోటీలో ఉండటంతో ఇక్కడ టైట్ ఫైట్ నడు స్తోంది. 2లక్షలకు పైగా యాదవ్ ఓట్లు ఉండటం టీఆర్ఎస్ కు కొంత వరకు అనుకూలించే అంశం అయినా…. కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కూడా ఇదే సామాజిక వర్గం. దీంతో ఓట్లు చీలుతాయనే టెన్షన్లో ఉంది టీఆర్ఎస్. సిట్టింగ్ సీటు కావటంతో పాటు…. నార్త్ ఇండియా రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండటం… తమకు కలిసి వస్తుందని నమ్మకం ఉన్నారు కమలనాథులు.  ఐతే సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండడంతో… గెలుపుపై ధీమాగా ఉంది కారు పార్టీ.

ఖమ్మం నియోజక వర్గంలో టీఆర్ఎస్ విచిత్ర పరిస్ధితి ఎదుర్కుంటోంది. 3 నెలల క్రితం టీఆర్ఎస్ అభ్యర్థిపై ఓడిపోయిన నామా నాగేశ్వరరావు… ఇప్పుడు కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇదే గులాబీ పార్టీకి పెద్ద మైనస్ అనే చర్చ జరుగుతోంది. జిల్లాలో పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోవటం… మొన్ననే నామాపై గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, దశాబ్దాలుగా నామాతో తుమ్మలకు ఉన్న వైరం.. మరోవైపు సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం మనస్త్పూర్తిగా పని చేయడం లేదనే అంశాలు… టీఆర్ఎస్ అభ్యర్థి నామాకు మైనస్ గా మారాయి.  కాంగ్రెస్ నుంచి కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి, టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో టీడీపీ క్యాడర్ బలంగా ఉండడం కూడా అధికార పార్టీకి ఇబ్బందిగా మారాయి.  దీంతో పార్టీ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డిని రంగంలోకి దింపింది TRS అధిష్టానం. పార్టీ ప్రచారంతో పాటు నేతలను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారు పల్లా.

నల్లగొండ సీటు టీఆర్ఎస్ .. కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో ఉండటం.. కాంగ్రెస్ కు గట్టి ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గం కావడంతో టీఆర్ఎస్ చాలా కష్టపడాల్సిన పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య  నేతలు జానారెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డిలు ఇదే లోక్ సభ పరిధికి చెందిన వారు. అటు టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి రాజకీయాలకు కొత్త కావటం… జనాలతో అంతగా సంబంధాలు లేక పోవటం TRS కు మైనస్ గా మారింది. నల్గొండ లోక్ సభ పరిధిలో ఒక్క హుజూర్ నగర్ మినహా మిగతా అన్ని నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటం కొంతవరకు కలిసివచ్చే అంశం. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును చాలెంజ్ గా తీసుకున్నారు. ప్రచారం మొదలు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

భువనగిరి లోక్ సభ సీటులోనూ పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పోటీ చేస్తుండగా… కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బరిలో ఉన్నారు. భువనగిరి లోక్ సభ పరిధిలో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. దీనికి తోడు కోమటి రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాథినిధ్యం వహిస్తున్న మునుగోడు ఈ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోనే ఉంది. గతంలో రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా కూడా పనిచేశారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు వ్యక్తిగత క్యాడర్ ఉంది. ఇక ఎంపీగా బూర చేసిన అభివృద్ధి, లోక్ సభ పరిధిలో మూడున్నర లక్షలకు పైగా ఉన్న గౌడ సామాజిక వర్గం ఓట్లు.. కలిసి వస్తాయని నమ్మకంగా ఉంది టీఆర్ఎస్. కోమటి రెడ్డి బ్రదర్స్ ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉండటంతో… ఇక్కడ పార్టీ సెక్రటరీ, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు శ్రవణ్ రెడ్డిని ఇంచార్జీగా నియమించింది TRS అధిష్టానం.

నిజామాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ కవితను ఈసారి ఎలాగైనా ఓడించాలని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు పసుపు, ఎర్రజొన్న రైతులు… ప్రభుత్వం తమను పట్టించుకోవటం పెద్ద సంఖ్యలో బరిలో ఉండడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. కవిత గెలుస్తుందని ఓవైపు ధీమాగా ఉన్నా… స్ధానికంగా మారుతున్న రాజకీయాలతో…. ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్ . నియోజకవర్గ పరిధిలో మున్నూరు కాపు ఓట్లు ఎక్కువ గా ఉన్నాయి.  బీజేపీ అభ్యర్థిగా బరిలో ధర్మపురి అరవింద్ ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు. దీనికి తోడు డి.శ్రీనివాస్ కొడుకు అరవింద్ గెలుపుకోసం తన వంతు  ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో  తనే స్వయంగా రంగంలోకి దిగి…. నియోజక వర్గంలోని సెట్టిలర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు టీఆర్ఎస్  అధినేత. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వర్ రావు ఇంటికి వెళ్ళిన సీఎం… ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో గెలుపు కోసమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ , బీజేపీలు స్ట్రాంగ్ అభ్యర్థులను దింపటంతో మల్కాజ్ గిరి నియోజక వర్గం కూడా టీఆర్ఎస్ కు క్రిటికల్ గా మారింది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అటు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రాంచంద్రరావు బరిలో ఉన్నారు.

దీంతో ఇక్కడ అధికార పార్టీకి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తుంది.  నియోజక వర్గంలో టీడీపీ ఓట్లు కీలకం కావ టంతో… వాటిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త కావటం.. మిగ తా ఇద్దరు అభ్య ర్థులు సీనియర్లు కావడం… టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ కు చెందిన వారే కావటం….అధికార పార్టీకి  కలిసి వచ్చే అంశం. ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో … క్షేత్ర స్థాయి పరిస్థితుల పై దృష్టి పెట్టింది గులాబీ హైకమాండ్.