- ఇంటి ముందు ఆడుకుంటుండగా ఘటన
- ప్రత్యేక టీమ్ లతో పోలీసుల గాలింపు
దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లాలో బాలిక కిడ్నాప్ అయింది. దండేపల్లి ఎస్ఐ తహసీనొద్దిన్ కథనం ప్రకారం.. మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శనిగారపు శేఖర్ కూతురు మహన్విత(7), సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తోటి పిల్లలతో కలిసి ఇంటిముందు ఆడుకుంటుంది. కొద్ది సేపటికి మిగతా పిల్లలు ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోగా.. మహన్విత ఇంటికి పోలేదు.
దీంతో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని బాలిక తండ్రి శేఖర్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో నంబాలతో పాటు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. కాగా.. అనుమానితుడిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
