ఇందూరులో టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్‘

ఇందూరులో టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్‘

నిజామాబాద్, వెలుగుకరోనా ఎఫెక్ట్​తో రాష్ట్రమంతా ఆందోళనకర పరిస్థితిలో ఉంటే.. నిజామాబాద్​ జిల్లాలో మాత్రం అధికార టీఆర్ఎస్​ రాజకీయం మొదలుపెట్టింది. త్వరలో నిజామాబాద్​ లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్​ జరగనున్న నేపథ్యంలో కొత్త ప్లాన్​ వేసింది. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చుకునేందుకు ‘ఆపరేషన్ ఆకర్ష్’ చేపట్టింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు నయానో, భయానో గులాబీ కండువాలు కప్పుతోంది. నిన్న మొన్నటిదాకా అక్కడ ఏ ఇద్దరు కలిసినా లాక్​డౌన్​ముచ్చట్లే వినిపించగా.. ఇప్పుడంతా ఎమ్మెల్సీ ఎలక్షనే హాట్​ టాపిక్​గా మారింది. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న భూపతిరెడ్డి సస్పెన్షన్ తో ఈ సీటు ఖాళీ అయి, ఎలక్షన్​ జరుగుతోంది.

చేరికల జోరు పెంచి..

నిజామాబాద్  కార్పొరేషన్ కు చెందిన ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు, నందిపేట జెడ్పీటీసీ మెంబర్ ఎర్రం యమున (బీజేపీ), ఏర్గట్ల జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ (కాంగ్రెస్), మాక్లూర్ మండలం అమ్రాద్ ఎంపీటీసీ లక్ష్మీ శ్రీనివాస్, గొట్టుముక్కల ఎంపీటీసీ సత్యగంగు, గుంజిలి ఎంపీటీసీ సుజాత, ఇస్పాపల్లి ఎంపీటీసీ లినితతోపాటు.. కామారెడ్డి జిల్లా పరిధిలో కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ముగ్గురు, ఇద్దరు ఎంపీటీసీలు ఇటీవలే టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా మంగళవారం ఏర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్  జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, ఆ పార్టీ సీనియర్​ నేత రేండ్ల రవి, మరికొందరు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆర్మూర్​ మండలం ఇస్సాపల్లి ఎంపీటీసీ లినిత, ఆమె భర్త మహేశ్​ ఆర్మూర్​ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.

బీజేపీని అడ్డుకునేందుకేనా?

ఇతర పార్టీల తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకునే విషయంలో టీఆర్ఎస్​ మొదటినుంచీ దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో వేరే పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేల నుంచి లోకల్​ బాడీల లీడర్ల దాకా ఎవరినీ వదల్లేదు. స్థానిక సంస్థల్లో పదవులు దక్కించుకునేందుకు అవసరమైన మెజారిటీ ఉన్నా కూడా చేర్చుకోవడాలు ఆపలేదు. అయితే పార్లమెంట్​ఎన్నికల నాటికి ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా పరిధిలో బీజేపీ బాగా బలపడింది. ఎంపీ సీటును గెలుచుకోవడంతోపాటు నాలుగు నెలల కింద జరిగిన లోకల్​ బాడీఎస్​ ఎలక్షన్​లోనూ సత్తా చాటింది. ఇక్కడి మొత్తం 60 వార్డుల్లో టీఆర్ఎస్​13 సీట్లే గెలవగా.. బీజేపీ 28 సీట్లు కైవసం చేసుకుంది. ఇలా బీజేపీ బలపడటాన్ని జీర్ణించుకోలేకపోయిన టీఆర్ఎస్.. లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్​ రావడంతో ఆపరేషన్​ ఆకర్ష్​ మొదలుపెట్టింది. ఎన్ని విమర్శలు వస్తున్నా దూకుడుగా చేరికలను ప్రోత్సహిస్తోంది. ఇతర పార్టీలవారిని చేర్చుకోకున్నా ఎమ్మెల్సీ సీటును గెలుచుకునే పరిస్థితి ఉన్నా కూడా.. కేవలం బీజేపీ బలోపేతాన్ని అడ్డుకునేందుకే ఈ గేమ్​కు తెరలేపిందని రాజకీయవర్గాలు అంటున్నాయి.

రాయ బేరాలతో..

లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు టీఆర్ఎస్​ ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులపై కన్నేసింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా ఈ పనిలోనే ఉన్నారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ‘పార్టీలో చేరితే ఏం చేస్తామన్నది, ఎంత బెనిఫిట్​ చేస్తామన్నది మధ్యవర్తులతో చెప్పి రాయబారాలు నడిపిస్తున్నారు. బేరాలూ మాట్లాడుతున్నారు. ఇదంతా ఎమ్మెల్యేలే ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైనా ముడిపడని పంచాయితీ ఉంటే మంత్రి దగ్గర తెగ్గొట్టి గులాబీ కండువాలు కప్పుతున్నారు” అని కొందరు నేతలు చెప్తున్నారు.