
ఓ వైపు కరోనా కల్లోలంతో భయపడిపోతున్న ముంబై సిటీని నిసర్గ తుఫాన్ మరింత వణికించింది. తీవ్ర రూపం దాల్చి తీవ్ర తుఫానుగా మారిన నిసర్గ దాదాపు వందేళ్ల తర్వాత ముంబై సిటీ వద్ద తీరం దాటబోతోందని నిన్న భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ముంబై సిటీకి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నరాయ్ గఢ్ జిల్లాలోని అలీబాగ్ వద్ద తుఫాను తీరం దాటింది. తీరం దాటిన సమయంలో పెనుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. తీరం దాటే సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే క్రమంగా ఇది బలహీనపడుతోంది. రాత్రి 9, 10 గంటల వరకు దీని ప్రభావం ఉంటుందని, పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. థానే, పాల్గడ్, రాయ్ గఢ్, ముంబై, పుణేలతో పాటు గుజరాత్, డామన్ డయ్యూల్లోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పింది. ఈదురు గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు కూలే ప్రమాదం ఉండడంతో ప్రజలవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. అలాగే తుఫాన్ ప్రభావం వల్ల ముంబైకి రావాల్సిన విమానలను డైవర్ట్ చేసింది పౌర విమానయాన శాఖ. రాత్రి ఏడు గంటల వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును మూసేస్తున్నట్లు ప్రకటించింది.
తుఫాను ప్రభావంతో దెబ్బతినే ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముందుగానే 43 టీమ్స్ ను రంగంలోకి దించినట్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్. ప్రధాన్ తెలిపారు. ఒక్కొక్క టీమ్ లో 45 మంది సభ్యులు ఉన్నారని, తుఫాను ప్రభావం వల్ల నష్టపోయే అన్ని తీర ప్రాంతాల్లో ఈ టీమ్స్ పని చేస్తున్నాయని చెప్పారు. ముందు జాగ్రత్తగా వేలాది మందిని సహాయ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 72,300 కరోనా కేసులు నమోదు కాగా, అందులో 2465 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకుని 31,333 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 38,502 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ముంబైలోనే 42 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ తుఫాను ముంబై సిటీలో తీరం దాటితే వైరస్ మరింత విజృంభిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొంత మేర ఆ ముప్పు తప్పినట్లేనని భావిస్తున్నారు.
కాగా, రెండు వారాల గ్యాప్ లోనే భారత తీరంపై విజృంభించిన రెండో తుఫాను నిసర్గ. గత నెలలో అంఫాన్ తుఫాను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 100 మంది పైగా మరణించారు. లక్ష కోట్ల రూపాయలపైగా ఆస్తి నష్టం జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాడు ప్రకటించారు.