హనుమకొండ/ ఖమ్మం, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీకి చేరువవుతుండటటంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతేడాది ఈ సమయానికి 40 డిగ్రీలు దాటని ఉష్ణోగ్రతలు గురువారం 46 డిగ్రీలకుపైగా నమోదవడం గమనార్హం. ఉదయం నుంచే వేడిగాలుల ప్రభావం కనిపిస్తుండటంతో జనాలు చాలావరకు ఇండ్లకే పరిమితమవుతున్నారు. గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో అత్యధికంగా 46.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.
జనగామ జిల్లా వడ్లకొండలో 46.3, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 46.2, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 46.1, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లిలో 46 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. కాగా, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో 45 కు పైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 16 మండలాల్లో 46 పైగా డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండడంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడే పరిస్థితి వచ్చింది. ఉదయం 9 గంటల నుంచి ఎండ ప్రభావం తీవ్రంగా ఉండడంతో మధ్యాహ్నమంతా రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.
