కొనుగోళ్లలో తీవ్ర జాప్యం.. నష్టపోయిన రైతులు, మత్స్యకారులు

కొనుగోళ్లలో తీవ్ర జాప్యం.. నష్టపోయిన రైతులు, మత్స్యకారులు

నారాయణ్ ఖేడ్, వెలుగు: 45 రోజులైనా కొనుగోళ్లు పూర్తి చేయకపోవడంతో వర్షాలతో వడ్లు తడిసి రైతులు.. వడ్లను కాపాడుకునేందుకు చెరువు నీటిని వదిలేయడంతో మత్స్యకారులు నష్టపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్కపల్లిలో శనివారం జరిగింది. తుర్కపల్లి లోని పటేల్ చెరువు పక్కనే ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని 45 రోజుల క్రితం ఏర్పాటు చేశారు. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండడం.. ఇటీవల పడ్డ వర్షాలతో కేంద్రానికి తెచ్చిన వడ్లు తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నారు. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పటేల్​చెరువు పూర్తిగా నిండింది. పక్కనే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన వడ్ల రాశులు ఎక్కడ తడిసిపోతాయోనని తూము మూడు గేట్ల నుంచి నీటిని కిందకు వదిలారు. దీంతో నీటితోపాటు ఆ చెరువులో వదిలిన రెండు లక్షల చేప పిల్లలు బయటకు పోయాయి. ఐకేపీ సెంటర్ వాళ్లు వర్షాలు మొదలవకముందే కొనుగోళ్లు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గ్రామ సర్పంచ్ అయిన తనకే వారం రోజులవుతున్నా వడ్లు అమ్మడానికి సంచులు ఇవ్వలేదని ఐకేపీ సెంటర్ నిర్వాహకులపై సర్పంచ్ స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షానికి వడ్లను కాపాడే ప్రయత్నంలో తూము వదలడంతో చెరువు పూర్తిగా ఖాళీ అయిందని, ఇందుకు కారకులైన  ఐకేపీ సెంటర్ వారిపై  కఠిన చర్యలు  తీసుకోవాలని అన్నారు.