ఏపీని భయపెడుతున్న తీవ్ర వాయుగుండం 

ఏపీని భయపెడుతున్న తీవ్ర వాయుగుండం 
  • వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాయుగుండం భయపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 560 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తోందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.   

వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు

మరోవైపు వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు దక్షిణ కోస్తా –  తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని సూచించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి బాగా పెరిగే అవకాశం ఉంది.