రెవెన్యూ శాఖ: పనులెక్కువ.. సిబ్బంది తక్కువ

రెవెన్యూ శాఖ: పనులెక్కువ..  సిబ్బంది తక్కువ
  • రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులపై తీవ్రంగా పని భారం
  • సర్టిఫికెట్ల నుంచి పథకాల అమలు దాకా వారిదే బాధ్యత
  • జిల్లాలు, డివిజన్లు, మండలాలు పెరిగినా మారని కేడర్‌‌‌‌ స్ట్రెంత్‌‌‌‌
  • రెండు, మూడు గ్రామాలకో వీఆర్వో.. పనుల్లో ఆలస్యం
  • ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:

క్యాస్ట్, ఇన్​కం సర్టిఫికెట్ల నుంచి పట్టాదారు పాస్​బుక్కులు, పహణీల్లో మార్పులు, ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక దాకా చాలా పనులు చేయాల్సింది రెవెన్యూ డిపార్ట్​మెంట్​ వాళ్లే. సంక్షేమ పథకమేదైనా అమలుపై ఆశాఖ అధికారులు, సిబ్బందిదే బాధ్యత. మండలానికి ఉన్నతాధికారులు ఎవరొచ్చినా, ప్రభుత్వపరంగా ఏ కార్యక్రమం జరిగినా ప్రొటోకాల్, అతిథి మర్యాదలు, ఏర్పాట్లు చూసుకునేది వారే. ఇన్నిరకాల బాధ్యతలు చూసే రెవెన్యూ శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెరిగిన జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్యకు అనుగుణంగా రెవెన్యూ శాఖలో కేడర్‌‌‌‌ స్ట్రెంత్‌‌‌‌ను పెంచాల్సి ఉన్నా.. సర్కారు పట్టించుకోవడం లేదు. అసలు పాత ఖాళీలనే ఇప్పటికీ భర్తీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

రెండు, మూడు గ్రామాలకో వీఆర్వో

రాష్ట్రంలో 10,885 రెవెన్యూ గ్రామాలున్నాయి. గ్రామానికో వీఆర్వో చొప్పున 10,885 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 5,088 మంది మాత్రమే పనిచేస్తుండటంతో.. ఒక్కో వీఆర్వో రెండు మూడు ఊర్ల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. దీనివల్ల ఏ ఒక్క గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. వీఆర్వో కేడర్‌‌‌‌ స్ట్రెంత్‌‌‌‌ను కూడా ప్రభుత్వం 7,039 మందికే పరిమితం చేసింది. రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామాల లెక్క ప్రకారం.. మరో 5,500 మంది వరకు వీఆర్వో పోస్టులు అవసరం. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆరేళ్లలో 1,017 మంది వీఆర్వోల నియామకం మాత్రమే జరగింది. పంచాయతీకో కార్యదర్శి నియమించినట్లుగానే గ్రామానికో వీఆర్వో నియామకం చేపడితే భూరికార్డుల నిర్వహణ, ఇతర సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జిల్లాలు, మండలాలు పెరిగినా పోస్టులు పెరగలే

రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలను సర్కారు 33 జిల్లాలుగా విభజించింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 44 నుంచి 72కు, మండలాల సంఖ్య 459 నుంచి 585కు పెరిగింది. పెరిగిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాలయాల్లో మెజార్టీగా పనిచేసేది రెవెన్యూ సిబ్బందే. దీంతో కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని 585 మండలాలకు గాను 121 మండలాల్లో పూర్తిస్థాయిలో తహసీల్దార్లు లేరు. ఆయా కార్యాలయాల్లో జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌, టైపిస్టు పోస్టులు సగం వరకు ఖాళీగా ఉన్నాయి. భూపరిపాలనకు కేంద్రమైన సీసీఎల్‌‌‌‌ఏ కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. కొన్నిసెక్షన్లలో క్లర్కులు, సూపరింటెండెంట్ల కొరత తీవ్రంగా ఉంది.

సీసీఎల్‌‌‌‌ఏ లేక మూడున్నరేళ్లు

రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా ‘చీఫ్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ (సీసీఎల్‌‌‌‌ఏ)’లేకుండానే భూరికార్డుల నిర్వహణ సాగుతోంది. ప్రతిష్టాత్మకంగా భూరికార్డుల ప్రక్షాళనను ప్రారంభించిన సర్కారు.. కీలకమైన సీసీఎల్‌‌‌‌ఏ పోస్టును ఖాళీగా ఉంచడంపై రెవెన్యూ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీసీఎల్‌‌‌‌ఏ లేకపోవడంతో రెవెన్యూ శాఖకు సంబంధించిన భూసమస్యలు, ఉద్యోగుల పదోన్నతులు, ట్రాన్స్‌‌‌‌ఫర్ల విషయంలో నిర్ణయాలు జాప్యం అవుతున్నాయని వాపోతున్నారు.

ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలె..

‘‘రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ఉన్నవారిపై పని ఒత్తిడి పెరిగింది. ఒక్కో వీఆర్వో రెండు, మూడు ఊర్లకు ఇన్‌‌‌‌చార్జిగా ఉండటంతో పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నరు. సర్టిఫికెట్ల జారీ, ఇతర సంక్షేమ పథకాల పనుల్లో ఆలస్యం జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా వీఆర్వోలపై నిందలు వేసి వేధించడం మానాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.’’ – గరికె ఉపేందర్‌‌‌‌రావు, వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Severe work burden on revenue employees in Telangana state