సిటీలో రోజురోజుకు తీవ్రమవుతున్న సీవరేజీ సమస్య

సిటీలో రోజురోజుకు తీవ్రమవుతున్న సీవరేజీ సమస్య
  • దెబ్బతిన్న పైప్​లైన్ల రిపేర్లను పట్టించుకోని వాటర్​బోర్డు
  • కనీసం మ్యాన్ హోల్స్​పై మూతలు ఏర్పాటు చేయట్లే
  • వానలు ఆగి నెల రోజులు దాటినా మొదలుకాని పనులు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​ పరిధిలో సీవరేజీ సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంది. ఎక్కడికక్కడ మ్యాన్​హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్​పేట వంటి ప్రధాన రోడ్లపైనే కిలోమీటర్ల మేర మురుగు పారుతుందంటే గల్లీల్లోని పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలాచోట్ల మ్యాన్​హోళ్లపై మూతలు లేవు. ఉన్నచోట సగం తెరిచి, పక్కకి ఒరిగి కనిపిస్తున్నాయి. ఉద్ధృతి పెరిగినప్పుడు, ఎక్కడైనా చెత్త, చెదారం అడ్డం పడినప్పుడు వాటి నుంచి మురుగు రోడ్డెక్కుతోంది. వానలు ఆగిపోయి నెల రోజులు దాటాక కూడా మ్యాన్ హోళ్లు పొంగిపొర్లడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నడవాలన్నా, బైక్​లపై వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు. భరించలేని కంపు కొడుతోందని మండిపడుతున్నారు. నిర్వహణ సరిగా లేకపోవడంతోనే తరచూ మురుగు సమస్య వస్తోందని ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రధాన జంక్షన్లలోని  ట్రాఫిక్ ​సిగ్నల్స్ ​వద్ద మురుగులోనే టూవీలర్స్​ ఆపి నిలబడాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్​తో సంబంధం లేకుండా రోడ్లపై పారుతోందని మండిపడుతున్నారు. వారం, పది రోజులైనా సమస్య అలాగే ఉంటోందని చెబుతున్నారు. వాటర్​బోర్డు పరిధిలోని ప్రాంతాల నుంచి డైలీ 200కు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కోచోట 10 నుంచి 15 రోజులుగా మ్యాన్​హోల్స్ పొంగిపొర్లుతున్నాయని చెబుతున్నారు. అందులో ఎక్కువగా మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, నానల్​నగర్, టోలిచౌకి, బంజారాహిల్స్, అఫ్జల్ గంజ్, బేగంబజార్, జూబ్లీహిల్స్, అల్వాల్, షేక్ పేట, లంగర్ హౌస్, చాంద్రాయణగుట్ట, ఆర్కేపురం, ఉప్పల్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, ముషీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వాటర్ బోర్డు ట్విట్టర్, గ్రీవెన్స్​ సెల్​కు ఫిర్యాదులు వస్తున్నాయి. అయినప్పటికీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిటీలో డ్రైనేజీ వ్యవస్థ లేదని నిపుణులు చెబుతున్నారు. 

పన్ను వసూళ్లపైనే ఫోకస్​

సీవరేజీ సెస్ వసూల్ చేయాలని వాటర్​బోర్డు ఎండీ ఇటీవల అధికారులకు ఆదేశాలిచ్చారు. చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెస్​ వసూలుపై ఉన్న శ్రద్ధ, మురుగు సమస్య పరిష్కారంపై ఉండడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ఉన్న ప్రాంతాలను పట్టించుకోని అధికారులు సెస్​ కట్టమని వస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్  అయ్యప్ప సొసైటీలో మొత్తం1,215 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో 780 నిర్మాణాలు, మిగతావి ఓపెన్ ప్లాట్లు. ఇండ్లతోపాటు ప్లాట్లలో కూడా మొత్తం వెయ్యికి పైగా డ్రైనేజీ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి వాటర్ బిల్లులో 30 శాతం సీవరేజీ సెస్ వసూల్ చేస్తున్నారు. అయ్యప్ప సొసైటీలో రెగ్యులర్​గా అందరూ సెస్ చెల్లిస్తున్నప్పటికీ, డ్రైనేజీ సమస్య వస్తే మాత్రం ఎవరూ  పట్టించుకోవడం లేదు.15 ఏళ్ల కిందట వేసిన డ్రైనేజీ లైన్​కావడంతో ప్రస్తుతం ఉన్న ఫ్లోకు సరిపోవడం లేదు. దీంతో డైలీ మ్యాన్ హోల్స్​ పొంగుతున్నాయి. అపార్ట్​మెంట్లు, ఇండ్లలోకి మురుగునీరు వస్తోంది.  ఇలా చాలా ప్రాంతాల్లో ఇదే  సమస్య ఉంది.