
- ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకుల నిరసన
ఓయూ, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. ఎల్. మూర్తి మాట్లాడుతూ.. కామన్ రిక్రూట్మెంట్ బోర్డును వెంటనే రద్దు చేసి యూనివర్సిటీలే స్వయంగా నియామకాలు జరపాలన్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.
ఓయూ భూములను కబ్జాదారుల నుంచి పరిరక్షించాలన్నారు. ఓయూ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు. ఓయూలో పెంచిన పీజీ, పీహెచ్డీ ఫీజులను వెంటనే తగ్గించాలన్నారు. హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
ప్రస్తుత రేట్లకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని.. క్యాంపస్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నేతలు ఆంజనేయులు, రవినాయక్, సాయి కిరణ్, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.