అమిత్‌‌షాపై సుప్రీం కోర్టుకు పోతా:మాజీ మంత్రి షబ్బీర్ అలీ

అమిత్‌‌షాపై సుప్రీం కోర్టుకు పోతా:మాజీ మంత్రి షబ్బీర్ అలీ

హైదరాబాద్, వెలుగు: ముస్లిం రిజర్వేషన్లను తొలగించడం కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా వల్ల కాదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ముస్లిం రిజర్వేషన్లపై చేసిన కామెంట్లకు అమిత్‌‌షాపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన చెప్పారు. సోమవారం గాంధీభవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామనడం బీజేపీ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పిందని, అదే సమయంలో పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా సూచించిందని ఆయన గుర్తు చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో పేద ముస్లింల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. వాటిని తొలగిస్తామనడం సరికాదని, ఆ రిజర్వేషన్ల తొలగింపు అమిత్‌‌షా వల్ల కాదు అని షబ్బీర్ అన్నారు. ఆయన ఒక వర్గానికి హోంమంత్రి కాదని, దేశాని హోంమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న అని చెప్పుకునే ఈటల రాజేందర్‌‌కు‌‌, అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత, కాంగ్రెస్ పార్టీ నేతలకు బీఆర్‌‌‌‌ఎస్ డబ్బులు ఇచ్చిందని ఆరోపించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.