ఆ భూమిని వేలం వేయాలి.. వచ్చే డబ్బును రుణమాఫీకి కేటాయించాలి: షబ్బీర్​ అలీ

ఆ భూమిని వేలం వేయాలి.. వచ్చే డబ్బును రుణమాఫీకి కేటాయించాలి: షబ్బీర్​ అలీ
  • కోకాపేటలో బీఆర్ఎస్​కు ఇచ్చిన  .. 11 ఎకరాలు వాపస్​ తీస్కోవాలి
  • బీఆర్ఎస్​కు ఇప్పుడు బంజారాహిల్స్​లో ఉన్న ఆఫీసే ఎక్కువ 
  • ఖతమైతున్న పార్టీకి కోకాపేటలో అంత విలువైన భూమి ఎందుకు?
  • ఫిరాయింపులపై కేటీఆర్, బీఆర్​ఎస్​ నేతలు మాట్లాడటం విడ్డూరం
  • 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను 
  • బీఆర్ఎస్​లో చేర్చుకుంది కేసీఆర్ కాదా? అని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన 11 ఎకరాల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆ భూమిని వేలం వేసి  వచ్చిన డబ్బును రైతుల రుణమాఫీకి ఖర్చు చేయాలని కోరారు. సోమవారం గాంధీ భవన్ లో షబ్బీర్​ అలీ మీడియాతో మాట్లాడారు. 

బీఆర్ఎస్ కు ఇప్పుడు బంజారా హిల్స్ లో ఉన్న పార్టీ ఆఫీసే ఎక్కువని అన్నారు. ఆ భూమి కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందేనని తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, త్వరలోనే రాష్ట్రంలో ఆ పార్టీ ఖతమైపోతుందని, అలాంటి పార్టీకి ఆఫీసు పేరు మీద కోకాపేటలో అంత విలువైన భూమి అవసరం లేదని ఆయన అన్నారు. 

కేసీఆర్​కు ఎస్సీ, మైనార్టీల గురించిమాట్లాడే అర్హత లేదు

పార్టీ ఫిరాయింపుల గురించి, కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతల గురించి బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​, ఆ పార్టీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘‘2018 లో అసెంబ్లీలో దళిత లీడర్​ భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేత హోదాలో ఉంటే నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో కలుపుకొని ఆయనకు ఆ హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా? నాడు శాసనమండలిలో నేను ప్రతిపక్ష నేతగా ఉంటే కాంగ్రెస్​ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లోకి తీసుకొని నాకు ఆ హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా?” అని ఆయన నిలదీశారు. 

ఎస్సీ, మైనార్టీల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. దళిత లీడర్​భట్టిని, మైనార్టీ అయిన తన విషయంలో ఇంత అవమానకరంగా వ్యవహరించిన కేసీఆర్ తీరును ఎవరూ మరిచిపోరని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పై ఫిరాయింపుల ఆరోపణలను కేటీఆర్, ఆ పార్టీ నేతలు ఎలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘నాడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు, గ్రామ స్థాయిలోని ప్రజా ప్రతినిధులను కూడా విడిచిపెట్టకుండా బీఆర్ఎస్ లో చేర్చుకొని అడ్డగోలుగా ఫిరాయింపులను ప్రోత్సహించి తెలంగాణ రాజకీయాలను అంగడి బజారులో పెట్టింది కేసీఆర్ కాదా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.