
ముంబై: బాలీవుడ్ మర్యాదకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేస్తున్నారనే కారణంతో పలు న్యూస్ చానల్స్‌పై హిందీ ప్రొడ్యూసర్స్ కేసు వేశారు. 38 ఫిల్మ్ బాడీస్‌తోపాటు ప్రొడక్షన్ హౌజ్‌లు కలసి ఈ కేసు వేశాయి. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీ గౌరవానికి భంగం వాటిల్లేలా టార్గెట్ చేసుకొని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రిపబ్లిక్ టీవీ, అర్నాబ్ గోస్వామి, ప్రదీప్ భండారీ, టైమ్స్ నౌ, రాహుల్ శివ శంకర్, నవికా కుమార్‌పై ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్ నిర్మాతలు కేసు దాఖలు చేశారు. బాధ్యతారాహిత్యమైన రిపోర్టింగ్ చేశారంటూ సదరు మీడియా సంస్థలపై నిర్మాణ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కేసు వేసిన నిర్మాణ సంస్థల్లో ప్రముఖ హిందీ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఫర్హాన్ అక్తర్‌తోపాటు నిర్మాతలు కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, జోయా అక్తర్‌ల నిర్మాణ సంస్థలు మరికొన్ని బడా బ్యానర్లు కూడా ఉన్నాయి. ఈ సూట్‌లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ గిల్డ్ ఆఫ్ ఇండియా (పీజీఐ), సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సీఐఎన్‌టీఏఏ) కూడా నిర్మాతలతో జాయిన్ అయ్యాయి. చెత్త, డ్రగ్గీస్, మాదక ద్రవ్యాలు, అరేబియన్ పర్ఫ్యూమ్స్ వంటి పలు దుర్భాషలాడే పదాలను సదరు న్యూస్ చానెల్స్ ఉపయోగించాయని ఆరోపణలు ఉన్నాయి.