బాలీవుడ్ బాద్ షా "పఠాన్" తో హిట్టు కొట్టాడా..?

బాలీవుడ్ బాద్ షా "పఠాన్" తో హిట్టు కొట్టాడా..?

నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ "పఠాన్" మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్ భామ దీపికా పదుకునే, జాన్ అబ్రహం తదితర నటులు కీలక పాత్రల్లో ...సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పీయరెన్స్ లో నటించిన ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ విడుదలైంది. ట్రైలర్, పాటలతో ఎంతో హైప్ క్రియేట్ చేసిన పఠాన్ కథేంటి..? పఠాన్ లో షారుక్ పాత్రేంటి..? పఠాన్ ప్రేక్షకులను ఆకట్టుుకున్నాడా..? గత 9 ఏళ్లుగా హిట్ లేని షారుక్ ఖాన్కు హిట్ లభించిందా..? ఓ సారి చూద్దాం..

అసలు  కథేంటి...?

"రా" ఏజెంట్‌ పఠాన్ (షారుక్ ఖాన్). విదేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా జరిగే కుట్రలను చేధించేందుకు ఇండియా తరపున ఆపరేషన్స్కు సారథ్యం వహిస్తాడు. దేశంలో ఆర్టికల్ 370 రద్దు చేశాక.. పాకిస్థాన్ కు చెందిన ఓ కల్నల్ దాడికి కుట్ర పన్నుతాడు. ఇందుకోసం ప్రైవేటు ఏజెన్సీ ఔట్ పిట్ ఎక్స్ చీఫ్ జిమ్ (జాన్ అబ్రహం)ను ఆశ్రయిస్తాడు. ఓ సంఘటనతో భారత్ పై ద్వేషం పెంచుకున్న జిమ్.. పాక్ తో చేతులు కలుపుతాడు. జిమ్ రక్త బీజ్ కాన్సెప్టుతో దేశంపై బయో వార్కు ప్లాన్ చేస్తాడు. ఈ బయో వార్ను పఠాన్ ఎలా అడ్డుకున్నాడు..? అనేది అసలు కథ.  భారత ఆర్మీలో పనిచేసే జిమ్.. దేశంపై ఎందుకు పగ పెంచుకున్నాడు..? పాక్ ఐఎస్ఐ ఏజెంట్ రుబీనా(దీపికా పదుకునే) పఠాన్‌ ప్రేమలో నిజమెంత? అసలు రక్త్ బీజ్ అంటే  ఏంటీ ? రక్త్ బీజ్ ఆపరేషన్‌ను పఠాన్ అడ్డుకున్నాడా..? ఈ కథలో టైగర్ (సల్మాన్ ఖాన్) పాత్ర ఏమిటి ..? తదితర ప్రశ్నలకు సమాధానమే పఠాన్ మూవీ.

ఫస్టాఫ్..

ఆర్టికల్ 370 రద్దు తర్వాత  పాక్.. ఇండియాపై బయోలాజికల్ వార్ చేయాలని జిమ్‌ (జాన్ అబ్రహం)తో ఒప్పందం చేసుకోవడంతో పఠాన్ మూవీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాకిస్థాన్ కుట్రలు, ఎత్తుకు పై ఎత్తులు వేసే క్రమంలో పఠాన్, దీపిక పదుకునే ఎంట్రీ. బేషరమ్ రంగ్ సాంగ్, జాన్ అబ్రహం, షారుక్ మధ్య యాక్షన్ సీన్లు ఫస్టాఫ్ లో ఆకట్టుకుంటాయి. ఇక పఠాన్‌ను రుబీనా చీట్ చేయడం, రక్త్ బీజ్ ప్లాన్   ట్విస్టులతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. 

సెకండాఫ్ ..

రక్త్ బీజ్ రసాయనాలను  రష్యా నుంచి తీసుకురావడం.. ఈ క్రమంలో షారుక్ దొరికిపోవడం తదితర సీన్లు సెకండాఫ్ లో ఆసక్తి పెంచుతాయి. ఆ సమయంలో టైగర్ (సల్మాన్ ఖాన్) ఎంట్రీ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తుంది. సల్మాన్ ఖాన్ పాత్ర నిడివి 10 నిమిషాలే అయినా.. అతని పాత్రతో సినిమా మరో లెవల్ కు వెళ్తుంది. సల్మాన్, షారుక్ మధ్య జరిగే సీన్లు ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్‌ అని చెప్పొచ్చు. సీన్లు బాగానే అనిపించినా.. రోటీన్ స్టోరీ పెద్దగా ఆస‌క్తిని రేకెత్తించ‌దు. ట్విస్టులను ప్రేక్షకుడు ముందే ఊహించగలడు. కానీ  షారుఖ్‌, దీపికా, జాన్ అబ్రహం సీన్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. అయితే దర్శకుడు మాత్రం ప్రేక్షకుడిని  క్లైమాక్స్ వరకు థియేటర్లోనే ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.

ఎవరెలా చేశారంటే..?

రా ఏజెంట్‌గా పఠాన్‌ క్యారెక్టర్ను షారుక్ ఖాన్‌ సమర్థవంతంగా పోషించాడు. యాక్షన్, రొమాన్స్, దేశభక్తి తదితర సీన్లలో షారుక్ ఖాన్ అద్బుతంగా నటించాడు. సిక్స్ ప్యాక్‌తో మరోసారి అదరగొట్టాడు. పఠాన్ సినిమాకు గ్లామర్ ఎట్రాక్షన్ దీపిక పదుకునే అని చెప్పొచ్చు. ఆమె కొన్ని యాక్షన్ సీన్లలో సూపర్గా నటించింది. పఠాన్ కు ధీటైన క్యారెక్టర్లో జాన్ అబ్రహం మెప్పించాడు. సల్మాన్ ఖాన్ ఎంట్రీ  ఫ్యాన్స్‌కు విందు భోజనం. ఇద్దరు సూపర్ స్టార్లు ఒకేసారి కనిపించడంతో థియేటర్లలో విజిల్స్ మోత మోగిపోయాయి. ఇంటర్వెల్ తర్వాత 10 నిమిషాలు, క్లైమాక్స్‌లో మరో 5 నిమిషాలపాటు సల్మాన్ కనిపించి ..సినిమాను మరో లెవల్కి తీసుకెళ్లాడు. 

పఠాన్ మూవీకి సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. యాక్షన్ సీన్లను సచిత్ పౌలోజ్ అద్బుతంగా చూపించాడు. కొన్ని యాక్షన్ సీన్లలో...ఎమోషనల్ సీన్లలో మ్యూజిక్ డైరెక్టర్లు సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా బీజీఎంతో అదరగొట్టారు. అలాగే  బేషరమ్ రంగ్, పఠాన్ సాంగ్స్ ఫ్యాన్స్కు మంచి జోష్ను ఇచ్చాయి. అయితే  పఠాన్ సినిమాలోని కొన్ని సీన్లు వార్ సినిమాను గర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు  సాధారణంగా నడిచే కథలో...ఆ తర్వాతే  వేగం పెరుగుతుంది. కొన్ని సీన్లు  ఓవర్గా అనిపిస్తాయి. మొత్తానికి "పఠాన్"  షారుక్, సల్మాన్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి మూవీ.