T20 World Cup 2024: పాక్ మాజీకి అరుదైన గౌరవం.. యువీ, గేల్ సరసన

T20 World Cup 2024: పాక్ మాజీకి అరుదైన గౌరవం.. యువీ, గేల్ సరసన

మరో వారం రోజుల్లో పొట్టి ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 20 జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా టీ20 ప్రపంచకప్‌ 2024 షురూ కానుంది. ఈ మెగా టోర్నీకి అంబాసిడర్‌గా పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఎంపికయ్యారు. 2009 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన పాక్ జట్టులో సభ్యుడైన అఫ్రిది.. 2007 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.

యువీ, గేల్ సరసన

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. మాజీ క్రికెటర్లు క్రిస్ గేల్, యువరాజ్ సింగ్, పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్‌లను అంబాసిడర్లుగా ప్రకటించింది. తాజాగా ఈ జాబితాలోకి షాహిద్ అఫ్రిది చేరారు. 

పాక్ తరుపున 34 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడిన ఆఫ్రిది 18.82 సగటుతో 546 పరుగులు, 39 వికెట్లు తీశాడు. లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్ వేదికగా జరిగిన 2009 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు .

జూన్ 9న భారత్‌- పాక్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఈ పోరు కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.