షమీ.. వాళ్లను క్షమించు

షమీ.. వాళ్లను క్షమించు
  • ఇండియా పేసర్ కు క్రికెట్, రాజకీయ ప్రముఖుల మద్దతు
  • షమీపై ట్రోలింగును ఖండించిన సచిన్ , సెహ్వాగ్, రాహుల్ గాంధీ

దుబాయ్‌‌: టీ20 వరల్డ్‌‌కప్‌‌లో పాకిస్తాన్‌‌ చేతిలోఇండియా ఓటమిని జీర్ణించుకోలేని కొంతమంది అభిమానులు హద్దులు దాటారు.  ఇండియా ఓటమికి స్టార్‌‌ పేసర్‌‌ మహ్మద్‌‌ షమీని బాధ్యుడిని చేస్తూ, అతనిపై ఆన్‌‌లైన్‌‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. 3.5 ఓవర్లలో 43 రన్స్‌‌ ఇచ్చిన షమీ వల్లే టీమ్‌‌ ఓడిందంటూ అతడిని విపరీతంగా ట్రోల్‌‌ చేయడంతో పాటు బూతులు తిట్టారు. దీన్ని  మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. టీమ్‌‌ మొత్తం ఓడితే.. షమీ ఒక్కడే బాధ్యుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.  క్రికెట్‌‌ లెజెండ్‌‌ సచిన్‌‌, సెహ్వాగ్‌‌తో పాటు కాంగ్రెస్‌‌ ఎంపీ రాహుల్‌‌ గాంధీ, జమ్మూ కాశ్మీర్‌‌ మాజీ సీఎం ఓమర్‌‌ అబ్దుల్లా తదితర ప్రముఖులు ఇండియా పేసర్‌‌కు మద్దతు ప్రకటించారు. ‘మనం ఇండియాకు సపోర్ట్‌‌ చేస్తున్నామంటే.. టీమ్‌‌కు ఆడే  ప్రతి ఒక్క ప్లేయర్‌‌కు సపోర్ట్‌‌ చేస్తున్నట్టే.  షమీ నిబద్దత కలిగిన వ్యక్తి. వరల్డ్‌‌ క్లాస్‌‌ బౌలర్‌‌. మరే ఇతర ప్లేయర్‌‌ మాదిరిగా ఓ రోజు షమీకి కూడా కలిసిరాలేదంతే. నేనైతే షమీ, టీమిండియా పక్షాన నిలుస్తా’ అని సచిన్‌‌ ట్వీట్‌‌ చేశాడు. షమీపై అన్‌‌లైన్‌‌ అటాక్‌‌ షాక్‌‌కు గురిచేసిందని సెహ్వాగ్‌‌ అన్నాడు. తాను షమీకి అండగా నిలుస్తానని చెప్పాడు. ‘షమీ మేమంతా నీవెంటే ఉన్నాం. వాళ్లంతా ద్వేషంతో నిండి ఉన్నారు. ఎందుకంటే  వాళ్లకు ఎవ్వరూఎలాంటి ప్రేమను పంచడం లేదు. వాళ్లను క్షమించు’ అని రాహుల్‌‌ గాంధీ ట్వీట్‌‌ చేశారు.