హిందూ ధర్మంలో శని దేవుడిని 'కర్మ ఫలదాత' అని పిలుస్తారు. అంటే మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు అని. 2026లో మే 16న వచ్చే శని జయంతి మన జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవడానికి ఒక గొప్ప అవకాశం.
శని జయంతి తేదీ, సమయం
వైశాఖ మాసం (కొన్ని ప్రాంతాల్లో జ్యేష్ఠ మాసం) అమావాస్య నాడు శని దేవుడు జన్మించాడు. 2026లో ఈ పండుగ మే 16, శనివారం రోజున వస్తుంది. కానీ ఈసారి శనివారం రోజే శని జయంతి రావడం విశేషం.
అమావాస్య ప్రారంభం: మే 16, తెల్లవారుజామున 05:11 గంటలకు.
అమావాస్య ముగింపు: మే 17, తెల్లవారుజామున 01:30 గంటలకు.
చాలా మంది శని దేవుడు అంటే భయపడతారు. కానీ ఆయన కేవలం కష్టాలను ఇచ్చే దేవుడు కాదు, మనల్ని క్రమశిక్షణలో పెట్టే ఒక 'గురువు'. మనం తప్పు చేస్తే శిక్షిస్తాడు, కష్టపడి పని చేస్తే అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చే జీవిత పాఠాలు మనల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా బలోపేతం చేస్తాయి.
శని జయంతి పూజా విధానం
శని జయంతి రోజున భక్తితో శని దేవుడిని పూజిస్తే జాతకంలోని దోషాలు తగ్గుతాయి. అందుకు ఏం చేయాలంటే.. శని జయంతి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయండి. నలుపు లేదా ముదురు నీలం రంగు దుస్తులు ధరించడం శని దేవుడికి ఇష్టం. తరువాత శని దేవుని విగ్రహానికి ఆవనూనె లేదా నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. తరువాత దీపారాధన కోసం ఆవనూనెతో దీపం వెలిగించి శని దేవుడి ముందు ఉంచండి. ఇప్పుడు నల్ల నువ్వులు, మినుములు, నల్లని వస్త్రం లేదా నీలి రంగు పూలను సమర్పించండి. తరువాత "ఓం శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమంతుడిని పూజించే వారిని శని దేవుడు ఇబ్బంది పెట్టడు. కాబట్టి హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది.
శని దోష నివారణ
శని దేవుని అనుగ్రహం కోసం ఈ చిన్న పనులు చేయండి:
*పేదవారికి, శారీరక వికలాంగులకు, వృద్దులకు సహాయం చేయండి. పాత చెప్పులు, నల్లని దుస్తులు లేదా అన్నదానం చేయడం వల్ల శని ప్రసన్నమవుతాడు.
*నల్ల కుక్కలకు లేదా కాకులకు, జంతువులకు ఆహారం పెట్టండి. శని గ్రహ దోషానికి ఇదొక ఒక సాంప్రదాయ పరిహారం.
* అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం, అహంకారంతో ప్రవర్తించడం మానుకోవాలి. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారికి శని ఎప్పుడూ రక్షణగా ఉంటాడు.
*ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి.
2026 శని జయంతి కేవలం ఒక మతపరమైన రోజు మాత్రమే కాదు... కర్మ, క్రమశిక్షణ, సహనం గుర్తుచేసేది కూడా. శని దేవుడు కఠినంగా కనిపించినప్పటికీ, ఆయన మిమ్మల్ని సత్యం, బాధ్యత, ఆధ్యాత్మిక జాగృతి వైపు నడిపించాలనుకుంటాడు. శని జయంతి రోజున మన తప్పులను సరిదిద్దుకుని, కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి ఒక మార్గం. ఓర్పు, పట్టుదల, సత్ప్రవర్తన ఉన్నవారికి శని దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉండి, మంచి తీపి ఫలితాలను అందిస్తాడు.
