ఏప్రిల్​ 6  శని త్రయోదశి..... పాటించాల్సిన కొన్ని నియమాలివే

ఏప్రిల్​ 6  శని త్రయోదశి..... పాటించాల్సిన కొన్ని నియమాలివే

ఏప్రిల్​ 6 శనివారం త్రయోదశి వచ్చింది. ఈరోజు శనికి అత్యంత ప్రీతికరమైన రోజు. కొన్ని నియమాలు పాటించడం ద్వారా శని ప్రభావం నుంచి తప్పించుకోవచ్చంటారు..ఆ నియమాలేంటో చూద్దాం.

 నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. మనిషి చేసే  పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. బతికి ఉండగా చేసే పాపపుణ్యాలను శని పరిగణలోకి తీసుని న్యాయమూర్తిగా వ్యవహరిస్తే మరణానంతరం ఆ పాపపుణ్యాల ఆధారంగా శిక్షలు అమలు చేస్తారు శని సోదరుడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇద్దరూ న్యాయాధికారులే.

 వాస్తవానికి శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని విశ్వాసం. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం. వాటినుంచి పూర్తిగా తప్పించుకోలేరు కానీ కొన్ని నియమాలు పాటించడం వలన శని ప్రభావం తగ్గుతుందంటారు పండితులు. 

శని శ్లోకం

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం

శని త్రయోదశి రోజు పాటించాల్సిన నియమాలు

  • సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి
  • ఆరోగ్యం సహకరించేవారు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అనంతరం భోజనం చేయాలి
  • శని త్రయోదశి రోజు మద్యమాంసాలు ముట్టుకోరాదు
  • శివార్చన, ఆంజనేయ స్వామి ఆరాధన ద్వారా శని ప్రభావం తగ్గుతుంది
  •  "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించినా మంచిదే
  • ఆకలితో అలమటించేవారికి భోజనం పెట్టాలి, మూగజీవాలకు కూడా
  • ఎవరి వద్ద నుంచి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తీసుకోవద్దు
  • శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయం లో ప్రసాదం పంచండి
  •  రోజుకో నువ్వుల ఉండను కాకికి తినిపించడం మంచిది
  • శనివారం రోజు రొట్టెపై నువ్వులు వేసి కుక్కలకు పెడితే శని ప్రభావం తగ్గుతుంది
  •  ఆంజనేయుడి ఆరాధన వలన శనిప్రభావం తగ్గుతుంది, సుందరకాండ పారాయణం చేయండి
  • కాలవలో కానీ నదిలో కానీ బొగ్గులు ,నల్ల నువ్వులు, మేకు శనికి నమస్కరించి వేయండి
  • బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు పెడితే శనిప్రభావం తగ్గుతుంది
  • ప్రతి శని వారం రాగి చెట్టుకు ప్రదిక్షణం చేయాలి
  • శనివారం రోజు శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టి, నల్లటి దుప్పటి దానం చేస్తే మంచిది
  • అయ్యప్ప మాల ధరించడం,  శ్రీ వెంకటేశ్వర స్వామికి తల నీలాలు ఇవ్వడం,  కాలభైరవ దర్శనం వల్ల కూడా శనిప్రభావం తగ్గుతుందిట