
నిర్మల్, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎర్రజెండా పార్టీలను అంతం చేయాలని కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్ మండిపడ్డారు. ఆ ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలన్నారు. నిర్మల్‌లోని పెన్షనర్ భవన్లో ఆదివారం సీపీఐ జిల్లా నాలులో మహాసభ నిర్వహించారు. హాజరైన శంకర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండను ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. మావోయిస్టు పార్టీని అంతం చేస్తామనే ప్రకటించడం కేంద్ర నిరంకుశ వైఖరిని తెలియజేస్తోందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయకుండా.. ప్రైవేట్, వ్యాపార సంస్థలకు కేంద్రం వత్తాసు పలుకుతోందని ధ్వజమెత్తారు. దేశంలో పేదలు, కార్మికుల పక్షాన సీపీఐ రాజీ లేకుండా పోరాటాలు చేస్తోందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, రేషన్ కార్డు లేని పేదలకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పీజీ కాలేజీ కోసం పోరాడుతాం..
నిర్మల్ జిల్లాలో గతంలో కొనసాగిన పీజీ కాలేజీని తిరిగి తెరిపించేందుకు పోరాటాలు కొనసాగిస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.విలాస్ పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన పీజీ సెంటర్‌ను వరంగల్‌కు తరలించడం సమంజసం కాదన్నారు.
ఈనెల 9న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ సీనియర్ నేతలు ఎస్ఎన్ రెడ్డి, భూక్య రమేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రవి, పద్మకుమారి, కైలాస్, సాయి, బి.శివాజీ, లచ్చన్న, అబ్దుల్ మజీద్, సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.