- రెండు రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్.. చికిత్స పొందుతూ మృతి
- తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు
- సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
ఉప్పల్, వెలుగు : ‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు’ అంటూ ఏండ్లపాటు దూరదర్శన్ ద్వారా వార్తలు అందించిన తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. రెండ్రోజుల క్రితం గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారు. శాంతి స్వరూప్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అనంతరం 1978లో దూరదర్శన్‌లో చేరారు.
అయితే యాంకరింగ్ చేసేందుకు ఆయన ఐదేండ్లు ఎదురు చూశారు. 1983 నవంబర్ 14న ప్రసారమైన దూరదర్శన్ తెలుగు తొలి బులిటెన్ వార్తలను ఆయన చదివి వినిపించారు. టెలి ప్రాంప్టర్ లేని రోజుల్లో స్క్రిప్ట్ ను బట్టీ పట్టి వార్తలు వినిపించడంలో ఆయన ఆరితేరారు. అలా పదేండ్ల పాటు స్క్రిప్ట్పేపర్లతోనే ఆయన వార్తలు చదివారు. 2011లో పదవీ విరమణ చేసే వరకు శాంతి స్వరూప్దూరదర్శన్లో న్యూస్ యాంకర్‌గా పనిచేశారు.
చాలా మంది న్యూస్ రీడర్లు శాంతి స్వరూప్‌ను గురువుగా భావిస్తారు. ‘వార్తలు చదవకండి.. వార్తలు చెప్పండి..’ అని తర్వాతి తరం యాంకర్లకు ఆయన సూచించేవారు. శాంతి స్వరూప్ భార్య రోజా రాణి కూడా న్యూస్ రీడరే. 1980లో వీరి వివాహం జరిగింది. ఇద్దరు సంతానం. వాళ్లు విదేశాల్లో స్థిరపడ్డారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్.. భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై ‘రాతి మేఘం’ అనే నవల రాశారు. క్రికెట్ మీద మక్కువతో ‘క్రేజ్’, సతీ సహగమనానికి వ్యతిరేకంగా ‘అర్ధాగ్ని’ అనే నవల రాశారాయన. యాంకరింగ్‌లో లైఫ్ టైమ్అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. శాంతి స్వరూప్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం రామంతాపూర్‌లో పూర్తయ్యాయి. ఆయన మృతికి బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ తదితరులు సంతాపం తెలియజేశారు.