నేను అలసిపోలే.. రిటైర్‌‌‌‌ కాలే.. నాకింకా అంత పెద్ద వయసు రాలే

నేను అలసిపోలే.. రిటైర్‌‌‌‌ కాలే.. నాకింకా అంత పెద్ద వయసు రాలే

ముంబై/థానె: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌‌ పవార్ చేసిన రిటైర్‌‌‌‌మెంట్‌‌ వ్యాఖ్యలకు 83 ఏండ్ల ఎన్సీపీ చీఫ్ శరద్‌‌ పవార్ కౌంటర్ ఇచ్చారు. తాను అలసిపోలేదని, రిటైర్‌‌‌‌ కాలేదని చెప్పారు. తాను ముందుకు సాగాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని, అందుకే పని చేస్తూనే ఉంటానని అన్నారు. రాష్ట్రవ్యాప్త పర్యటనను నాసిక్ నుంచి శరద్‌‌ పవార్ ప్రారంభించారు. పార్టీని మళ్లీ నిర్మించేందుకు నాసిక్ తర్వాత పుణె, సోలాపూర్‌‌‌‌తోపాటు విదర్భ రీజియన్‌‌లోని మరికొన్ని ప్రాంతాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఓ మరాఠీ న్యూస్‌‌ చానల్‌‌తో మాట్లాడిన ఆయన.. ‘‘మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో మీకు తెలుసా? ప్రధాని కావాలనో, మంత్రి కావాలనో లేదు.. కేవలం ప్రజలకు సేవ చేయాలని మాత్రమే ఉంది” అని చెప్పారు. తనకు ఇంకా అంత పెద్ద వయసు రాలేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌‌పేయి చెప్పిన.. ‘‘నేను అలసిపోలేదు.. రిటైర్‌‌‌‌ కాలేదు” అనే వ్యాఖ్యను ప్రస్తావించారు. తాను రిటైర్‌‌‌‌ కావాలని చెప్పడానికి వాళ్లెవరని, తాను ఇప్పటికీ పని చేయగలనని అన్నారు. శరద్ పవార్ కొడుకును కానందువల్లే తనను సైడ్‌‌లైన్‌‌ చేశారంటూ అజిత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘ఈ విషయంలో మాట్లాడటానికి పెద్దగా ఏమీ లేదు. కుటుంబ విషయాలను బయట మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అజిత్‌‌ పవార్‌‌‌‌ను మంత్రిని చేశాను. డిప్యూటీ సీఎంను చేశాను. కానీ అవకాశం ఉన్నప్పటికీ నా బిడ్డ సుప్రియా సూలేకు మంత్రి పదవి ఇవ్వలేదు” అని శరద్‌‌ చెప్పారు.

ఒకే స్టేజ్‌‌పై త్రిమూర్తులు

మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ చీలిక వర్గం చేరిన తర్వాత తొలిసారిగా.. సీఎం ఏక్‌‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్, అజిత్‌‌ పవార్‌‌‌‌ ఒకే వేదికను పంచుకున్నారు. గడ్చిరోలిలో జరిగిన 
ఓ కార్యక్రమానికి వీరు ముగ్గురు హాజరయ్యారు. 

అట్ల అనుకుంటే రాజకీయాలే వదిలేస్త: జితేంద్ర అవద్

శరద్‌‌ పవార్ చుట్టూ కోటరీ ఉందని అజిత్‌‌ పవార్ వర్గం నిజంగా నమ్మితే.. తాను పార్టీ నుంచి వైదొలుగుతానని, రాజకీయాలను పూర్తిగా వదిలేస్తానని ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ అన్నారు. నాసిక్‌‌లోని యెవోలకు వస్తున్న శరద్ పవార్‌‌‌‌ను ఆహ్వానించేందుకు వచ్చిన జితేంద్ర.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘మాలో కొంతమంది శరద్ పవార్ చుట్టూ కోటరీలా ఉన్నామని వాళ్లు భావిస్తే.. ఈ కారణంతోనే ఎన్సీపీని వదిలి వెళ్లాల్సి వచ్చిందని వారు అనుకుంటే.. నేను పార్టీని, రాజకీయాలను వదిలేస్తా. జయంత్ పాటిల్ కూడా రిజైన్ చేస్తారు. వాళ్లు నిజంగా మా వల్లే పార్టీ నుంచి వెళ్లిపోయి ఉంటే.. ఇక మేం పార్టీలో ఉండి ఏం లాభం” అని అన్నారు.