
- సెన్సెక్స్ అర శాతానికి పైగా డౌన్
- జీఎస్‌టీ రేట్లు తగ్గడంతో మార్కెట్‌కు కొంత ఊరట
ముంబై: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్ 1బీ వీసా ఫీజును పెంచడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం అర శాతానికి పైగా నష్టపోయాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాలు పెరిగాయి. వీటితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా నష్టపోవడంతో మార్కెట్ నెగెటివ్‌లో కదిలింది. సెన్సెక్స్ సోమవారం 466.26 పాయింట్లు లేదా 0.56 శాతం తగ్గి 82,159.97 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 628.94 పాయింట్లు లేదా 0.76 శాతం పడిపోయి 81,997.29కి చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 124.70 పాయింట్లు లేదా 0.49 శాతం తగ్గి 25,202.35 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌లోని కంపెనీల్లో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కాగా, ట్రంప్ శుక్రవారం వీసాలపై ఫీజును ఒక్కో వ్యక్తికి లక్ష డాలర్లకు పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇది కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని వైట్ హౌస్ శనివారం స్పష్టం చేసింది.
ఐటీ షేర్లపై ఒత్తిడి
‘‘హెచ్1బీ ఖర్చు పెంపుతో ఐటీ ఇండెక్స్ భారీగా పడింది. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అయితే జీఎస్‌టీ తగ్గింపు, సాధారణ వర్షాలు, తక్కువ వడ్డీ రేట్లు, పన్ను ప్రోత్సాహకాలు వినియోగాన్ని ప్రోత్సహించనున్నాయి. దీంతో మార్కెట్ పతనం లిమిటెడ్‌గా ఉంది”అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. బీఎస్‌బీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ సోమవారం 0.78 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.71 శాతం తగ్గాయి. రంగాల వారీగా చూస్తే, బీఎస్‌ఈ ఫోకస్డ్ ఐటీ 3శాతం, ఐటీ 2.73శాతం, టెక్ 2.09శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.77శాతం, ఇండస్ట్రియల్స్ 0.75శాతం, ఆటో 0.41శాతం తగ్గాయి. మరోవైపు యుటిలిటీస్ 2.56శాతం, పవర్ 1.66శాతం, మెటల్ 0.39శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.36శాతం, సర్వీసెస్ 0.08శాతం పెరిగాయి.
బీఎస్‌ఈలో 2,511 షేర్లు తగ్గగా, 1,775 షేర్లు పెరిగాయి. 169 షేర్ల ధరల్లో మార్పు లేదు. ‘‘ఐటీ షేర్ల అమ్మకాలతో మార్కెట్ నెగెటివ్‌లో ఓపెన్ అయ్యింది. జీఎస్‌టీ తగ్గింపు చర్యలతో కొంత రికవరీ కనిపించినా, సెషన్ చివరిలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది”అని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు. మరోవైపు ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు శుక్రవారం నికరంగా రూ.390.74 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, సోమవారం మాత్రం రూ.2,900 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు తగ్గి 88.31 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కొస్పీ, జపాన్ నిక్కీ 225, చైనా ఎస్‌ఎస్‌ఈ కాంపోసైట్ లాభాల్లో ముగియగా, హాంకాంగ్ హంగ్‌సెంగ్ నష్టాల్లో క్లోజయ్యింది. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.1.78 లక్షల కోట్లు అప్
హిండెన్‌బర్గ్ కేసులో సెబీ క్లిన్‌చిట్ ఇవ్వడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం కూడా ర్యాలీ చేశాయి. రెండు రోజుల్లో రూ.1.78 లక్షల కోట్ల మార్కెట్ విలువ పెరిగింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలు వంటి ఆరోపణలను సెబీ తోసిపుచ్చడంతో పెట్టుబడిదారుల విశ్వాసం బలపడింది. అదానీ పవర్ షేర్లు సోమవారం 20శాతం పెరిగి రూ.170.15కి చేరాయి. అదానీ టోటల్ గ్యాస్ 20శాతం, గ్రీన్ ఎనర్జీ 11.75శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 6.94శాతం, ఎంటర్‌ప్రైజెస్ 4.24శాతం లాభపడ్డాయి. అంబుజా, అదానీ పోర్ట్స్, ఎన్‌డీటీవీ, ఏసీసీ కూడా లాభాల్లో ముగిశాయి.