రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేయాలి

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేయాలి

నిరుద్యోగులను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. షర్మిల కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్రంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల..  నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. YSR హయాంలో మూడు సార్లు నోటిఫికేషన్ లు ఇచ్చారని..ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు సృష్టించారని చెప్పారు. ఇప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పి ఆత్మహత్యల తెలంగాణగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు లేక రాష్ట్రంలో 54 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగం పెరగడానికి కారణం కేసీఆరే అన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 8 ఏండ్లు అవుతున్నా.. నోటిఫికేషన్లు వేయడం కేసీఆర్ కి చేతకావడం లేదని షర్మిల ఆరోపించారు. నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలు రాక.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారన్నారు.  నిరుద్యోగుల పక్షాన కనీసం ప్రతిపక్షాలు పోరాటం చేయడం లేదన్నారు. పార్టీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసం 72 గంటల దీక్ష చేశానని..తన పోరాటంతోనే రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య ఉందనే  విషయం బయటకు వచ్చిందన్నారు. నిరుద్యోగులవి ఆత్మహత్యలు కావని....కేసీఆర్ చేసిన హత్యలు అన్నారు. 

సీఎం కేసీఆర్ కి అసలు పరిపాలన చేతకాదన్నారు షర్మిల. ఉద్యోగాలు కల్పించే విషయంపై ఆయనకు కనీస అవగాహన లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏనాడైనా సచివాలయానికి వచ్చారా అని నిలదీశారు. ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తే ఇలానే ఉంటుందన్నారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. ఊరించి ఊరించి 20 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇచ్చారని దుయ్యబట్టారు. ఒక్కో ఉద్యోగానికి 900 మంది పోటీ ఉందన్నారు. ఉద్యోగాలు లేక డిగ్రీలు,పీజీలు చదివి ఆటో నడిపే పరిస్థితికి వచ్చిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో అందరూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. 

కేసీఆర్ బిడ్డలు రాజ్యాలు ఏలాలి ..ప్రజల బిడ్డలు మాత్రం హమాలి పని చేసుకోవాలా ? అని షర్మిల ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందన్నారు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులకు కప్పలు, పురుగులు పట్టిన బియ్యంతో భోజనం పెడుతున్నారని విమర్శించారు. ఇక ఫీజురియింబర్స్ మెంట్ పథకం అటకెక్కిందన్నారు. మూడేండ్లుగా రూ.3,500 కోట్ల ఫీజుల బకాయిలు పడ్డాయని తెలిపారు. విద్యార్థులు ఫీజులు కట్టలేక కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఇక విశ్వ విద్యాలయాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రొఫెసర్ పోస్ట్ లను భర్తీ చేయక ఉన్నత విద్య గందరగోళంలో పడిందన్నారు. విద్యార్థులకు ఇంత అన్యాయం చేస్తున్నా.. బీజేపీ,కాంగ్రెస్ లు ఏనాడు కేసీఅర్ ఆగడాలను ప్రశ్నించడం లేదన్నారు. 

ప్రజలు అధికారం ఇస్తే  వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకువస్తానని షర్మిల చెప్పారు.  వైఎస్సార్ లా ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తానన్నారు. అధికారంలోకి వస్తే భారీగా ఉద్యోగాల కల్పనపైనే తన తొలి సంతకం పెడతానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ద్వారా  లోన్లు మంజూరు చేయాలన్నారు. నిరుద్యోగ సమస్యపై వెంటనే పరిష్కారం చూపించాలన్నారు. లేకుంటే రాజీనామా చేసి దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.