సర్కారు దగ్గర డబ్బుల్లేక పథకాలన్నీ బంద్

సర్కారు దగ్గర డబ్బుల్లేక పథకాలన్నీ బంద్

వనపర్తి, పెబ్బేరు, వెలుగు: ఫీజు రీయింబర్స్​మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను కేసీఆర్​ సర్కారు ఆగమాగం చేసిందని వైఎస్సార్​​టీపీ చీఫ్​ షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం వనపర్తి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పెబ్బేరులో ఆమె మీడియాతో మాట్లాడారు. సర్కారు దగ్గర డబ్బుల్లేక అన్ని పథకాలను మూలకు పడేసిందని ఆరోపించారు. వ్యవసాయాన్ని వైఎస్సార్ పండుగ చేస్తే..  రైతులను కేసీఆర్​ మోసం చేశారన్నారు. పండిన పంట కొనడం లేదని, దళారులు రైతులను దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేవలం రైతు బంధు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. జనం అనేక సమస్యలతో అల్లాడుతుంటే.. కేసీఆర్​ ఫామ్​హౌస్​ను వీడడం లేదన్నారు. కేవలం ఓట్ల సీజన్​లో మాత్రమే ఆయన బయటకు వస్తారన్నారు.

రాష్ట్రంలో వృద్ధులకు పింఛన్లు రావడం లేదని, సమయానికి ఉద్యోగులకు జీతాలు రావడం లేదని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం దిక్కులేదని, కౌలు రైతును పట్టించుకునే వాళ్లు లేరని ఫైరయ్యారు. బంగారు తెలంగాణలో కేవలం కేసీఆర్​ కుటుంబమే బాగు పడిందని, నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి జనంపై పన్నుల భారం వేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు తీసుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఉద్యోగాల్లేక యువకులు సూసైడ్స్​ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.