
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 17న సాయంత్రం 5.30 గంటలకు రాజస్థాన్, జోధ్ పూర్ లోని ప్యాలెస్ లో కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయాల ప్రకారం రాజారెడ్డి, ప్రియ అట్లూరి పెళ్లి వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 18న ఉదయం క్రిస్టియన్ సంప్రదాయ పద్దతిలో మరోసారి వీరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ షర్మిల సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేసింది.
వైఎస్ షర్మిల కుటుంబం రెండు రోజుల క్రితమే జోధ్ పూర్ ప్యాలెస్ కు వెళ్లింది. ఫిబ్రవరి 16న సంగీత్, మెహందీ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను షర్మిల తన ట్విట్టర్లో షేర్ చేశారు.
పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ కు ప్లాన్ చేశారని తెలుస్తోంది. శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసెప్షన్ జరగనుంది. పలువురు సినీ,రాజకీయ, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారని సమాచారం. జనవరి 18న రాజారెడ్డి, ప్రియ ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లో జరిగింది. సీఎం జగన్ దంపతులు ఈ వేడుకకు హాజరయ్యారు.