సాల్వాపూరులో  ప్రతాప రుద్రుని కాలం నాటి శాసనం

సాల్వాపూరులో  ప్రతాప రుద్రుని కాలం నాటి శాసనం

హైదరాబాద్, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సాల్వాపూరులో కాకతీయ ప్రతాప రుద్రుడి కాలంనాటి శాసనం వెలుగు చూసింది.‌ కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు దేవారం రమేశ్ శర్మ, సామలేటి మహేశ్ ఈ శాసనాన్ని గుర్తించగా, బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ చదివి, పరిష్కరించారు. గానుగలవారు, సేనివారి ప్రస్తావన ఇందులో ‌ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాకతీయ ప్రతాప రుద్రుడు రాజ్యమేలినప్పుడు విరోధినామ(1290-91) సంవత్సరంలో వేయించినట్లు శాసనంలోని వివరాలు వెల్లడిస్తున్నాయి. నాలుగు వైపులా తెలుగు భాషలో, తెలుగు లిపిలో శాసనం రచించారు. గానుగలవారు, సేనివారి కన్నా ముందు ఎవరో చేసిన మాడ దానం గురించి ఈ శాసనంలో ప్రస్తావించారు. గానుగల వారిని తెలికలని కూడా పిలుస్తారు. వీరు నూనె గానుగలను తిప్పేవారు. చేసే వృత్తి పేరు మీదనే వీరికి గానుగల వారని పేరొచ్చింది. సేనివారు నేత వృత్తివారు కావొచ్చని హరగోపాల్ వెల్లడించారు. గానుగల వారు గానుగ ఒక్కంటికి అడ్డుగ(అర్థ రూక), సేని వారు మగ్గానికి ఒక్కంటికి అడ్డుగ చెల్లించాలని ఈ శాసనం చెప్తోందన్నారు. శాసనం రెండోవైపు అక్షరాలు చదవడానికి అవకాశంలేకుండా ఉన్నాయని ఆయన తెలిపారు.