రేవంత్ కు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా

రేవంత్ కు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా

హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్ష రేసులో మల్లికార్జున ఖర్గే దూసుకుపోతున్న వేళ... అధ్యక్ష బరిలో ఉన్న మరో నేత శశిథరూర్ హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర  కాంగ్రెస్  నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం శశి థరూర్ పర్యటనకు దూరంగా ఉన్నారు. మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతు ఉందని , ఈ మేరకు అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డికి స్పష్టమైన సమాచారం ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన హైదరాబాద్ లో పర్యటిస్తున్న శశి థరూర్ ను కలవలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ శశి థరూర్ చేసిన ట్వీట్ హీట్ పుట్టిస్తోంది. ‘‘తమ బంధువును కోల్పోయిన రేవంత్ కు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మనం ఇవాళ కాకపోతే మరో సందర్భంలోనైనా కలుద్దాం. కానీ నీకు, నీ టీమ్ కు నా శుభాకాంక్షలు’’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. రేవంత్ తన పర్యటనకు దూరంగా ఉన్నందుకే శశి థరూర్ ఈ ట్వీట్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఇకపోతే... కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ముందు నుంచి పోటీలో నిలిచిన దిగ్విజయ్ సింగ్.. సీన్ లోకి మల్లికార్జున ఖర్గే ఎంట్రీ ఇవ్వడంతో తప్పుకున్నారు. ఇక రేసులో మిగిలింది ఖర్గే, శశి థరూర్ మాత్రమే. ఖర్గే ముందు నుంచి కూడా గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఇదేకాక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా  అనుభవం ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఇక శశి థరూర్ విషయానికి వస్తే.. వీలు చిక్కినప్పుడల్లా గాంధీ కుటుంబంపై విమర్శలు సంధిస్తూ వస్తున్నారు. ఇది ఆయనకు శాపంగా మారిందని కాంగ్రెస్ లోని ఓ వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆశీర్వాదాలు మల్లికార్జు ఖర్గేకు సంపూర్ణంగా ఉన్నాయని, ఈ నెల 17న జరిగే అధ్యక్ష ఎన్నికలో ఆయన గెలుపు ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.