మనవడి కోసం ఎంట్రప్రెన్యూర్ ​ అయింది

మనవడి కోసం ఎంట్రప్రెన్యూర్ ​ అయింది

పద్దెనిమిదేండ్ల వయసులో పెండ్లి.. ఇరవై మూడేండ్లకి ఒక బిడ్డ, ఇద్దరు కొడుకులు . కానీ, ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు ఆ తల్లి ఒడిలో. రెండున్నరేండ్లకే  కూతురు దూరమైంది. అయినా గుండెనిండా ధైర్యం నింపుకొని.. కొడుకులే ప్రాణంగా బతికింది. కానీ, విధి ఆటలో పెద్ద కొడుకు బ్రెయిన్​ ట్యూమర్​తో , చిన్న కొడుకు గుండె జబ్బుతో ఆ తల్లిని ఒంటరిని చేశారు. అప్పట్నించీ తనకంటూ మిగిలిన మనవడే ఆమె ప్రపంచం అయ్యాడు. అతడ్ని కూడా కారు ప్రమాదం గాయపరిచింది. అయినా ఆమె బతుకుతో పోరాటం ఆపలేదు. మనవడి కోసం 77 ఏండ్ల  వయసులో ఫుడ్​ బిజినెస్​ చేస్తోంది. లక్షల్లో సంపాదిస్తున్న ముంబైకి చెందిన ఆమె  పేరు ఊర్మిళ​ అషీర్​.

‘‘నా కడుపున పుట్టిన వాళ్లంతా దూరమయ్యాక.. బతకడానికి ఓ ఆశ కల్పించాడు నా మనవడు. కానీ, 2019 లో అనుకోని ప్రమాదం తనని కూడా చావు బతుకుల మధ్యకి నెట్టింది. ప్రాణాలైతే దక్కాయి. కానీ,  వాడి నవ్వు మాత్రం శాశ్వతంగా దూరమైంది. ఆ యాక్సిడెంట్​లో నా మనవడి కింది పెదవి పోయింది. దాంతో ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడేవాడు. తనని తానే అసహ్యించుకునేవాడు. అలా ఇంటికే పరిమితమై పోవడం వల్ల మాకు జీవనాధారంగా ఉన్న   షాపు నష్టాల్లో కూరుకుపోయింది. కరోనా లాక్​డౌన్​ వల్ల పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. దాంతో మూడు పూటలా తినడానికి లేదు. అప్పులు పేరుకుపోయాయి. మాకన్నా దీనస్థితిలో ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు.. అందుకే అవి పెద్ద సమస్యలుగా కనిపించలేదు నాకు. ఇదే విషయం నా మనవడితోనూ చెప్పా.  ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి నాకిష్టమైన వంటనే వ్యాపారంగా చేసుకోవాలనుకున్నా.’’

‘గుజ్జు బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న నాస్త’  పేరుతో..

‘గుజ్జు బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న నాస్త’  పేరుతో మొదట పచ్చళ్లు అమ్మా.  ఇరవై రోజుల్లోనే 500 కేజీల పచ్చళ్ల ఆర్డర్​ డెలివరీ చేశా.  పచ్చళ్ల అమ్మకానికి ఎలాంటి ప్రమోషన్​​ చేయలేదు. ఆ నోట ఈనోట నా చేతి వంట రుచి గురించి వినే కస్టమర్స్ వచ్చారు. పెద్ద పెద్ద ఆర్డర్స్​ వచ్చాయి. ఆ తర్వాత తెప్లా, ధోక్లా, పూరన్​ ​ పోలి, ఫరాలీ లాంటి గుజరాతీ శ్నాక్స్​ని కూడా మెనూలో చేర్చా. ఇద్దరు డెలివరీ బాయ్స్​ని పెట్టుకున్నా. సంవత్సరం తిరిగే సరికే 45 లక్షల ఆదాయం వచ్చింది. ఆ డబ్బు కంటే కూడా జనాలు హెల్దీ వంటకాల్ని తింటున్నారన్నదే ఎక్కువ సంతోషాన్నిస్తుంది నాకు.  టెడెక్స్ వేదికపైనా మాట్లాడే అవకాశం వచ్చింది. వివిధ ప్రాంతాలకెళ్లి నా కథతో చాలామందిలో ధైర్యం నింపుతున్నా.’’

రేపు బాగుంటుందన్న ఆశతో..

‘గుజ్జు బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న నాస్త’ పేరుతో యూట్యూబ్​ ఛానెల్​ కూడా మొదలుపెట్టా. అందులో రకరకాల వంటకాల్ని చేసి, చూపెడుతున్నా. ఉదయమంతా వంటలు చేస్తా.. మధ్యాహ్నం యూట్యూబ్​ ఛానెల్​ కోసం వీడియోలు రికార్డ్​ చేస్తా. ఇదంతా చూసి నా మనవడు ‘ నువ్వు నా జీవితాన్ని మార్చేశావు బామ్మ’ అంటుంటాడు. కానీ, నేను దాన్ని ఒప్పుకోను. మనవళ్లు, మనవరాళ్లని ప్రొటెక్ట్​ చేయడమే కదా బామ్మల పని అనేది నా నమ్మకం. అలాగే అందరూ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిందే. అందుకే దానికి భయపడొద్దు. ధైర్యంగా చావుని గెలవాలి. రేపు బాగుంటుందన్న ఆశతో ఈ రోజుని సంతోషంగా గడపాలి’’ అంటున్న ఈ బామ్మ ఎందరికో ఇన్​స్పిరేషన్​.