మృత్యువుతో పోరాడుతున్న రేప్ బాధితురాలు

మృత్యువుతో పోరాడుతున్న రేప్ బాధితురాలు

కోర్టుకు పోతుంటేనిప్పంటించిన్రు
యూపీలో రేప్​ బాధితురాలిపై నిందితుల ఘాతుకం
కత్తులతో దాడి.. ఆపై కిరోసిన్ పోసి నిప్పు
మంటల్లోనే కిలోమీటర్​ దూరం పరుగుతీసిన మహిళ
ఆర్తనాదాలు చేస్తూనే ఎమర్జెన్సీకి ఫోన్
90శాతం గాయాలతో హాస్పిటల్లో..
మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలు
దారుణం తర్వాత ఇండ్లలోనే
పట్టుబడ్డ ఐదుగురు నిందితులు
మార్చిలో రేప్ కేసు పెట్టిన బాధితురాలు
బెయిల్​పై బయటికొచ్చి..
కోర్టు విచారణ రోజే నిందితుల దారుణం
రాజ్యసభలో దుమారం.. రేపిస్టులను కఠినంగా శిక్షించాలన్న ఎంపీలు

రేప్​ బాధితురాలికి మంటలు అంటించిన చోట క్లూస్​ సేకరిస్తున్న పోలీసులు

న్యాయం కోసం కోర్టుకు బయలుదేరిన ఓ అత్యాచార బాధితురాలికి రేపిస్టులు నిప్పంటించారు. అదే మంటల్లో ఆ మహిళ ధైర్యాన్ని కూడదీసుకొని కిలోమీటర్​ వరకు పరుగులు తీస్తూ.. పోలీసులకు కాల్​ చేసింది. ‘రక్షించండి.. రక్షించండి’ అంటూ ఆర్తనాదాలు చేసింది. 90 శాతం కాలిన గాయాలతో ఆ యువతి హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లోని ఉన్నావ్​ జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన ‘దిశ’ అత్యాచారం, హత్య ఘటనపై దేశమంతా అట్టుడుకుతుండగానే మరో ఘటన చోటుచేసుకోవడం షాక్​కు గురిచేసింది. ఈ దారుణాలపై మరోసారి పార్లమెంట్  దద్దరిల్లింది.

తెల్లవారుజాము కావడంతో అక్కడ ఎవరూ లేరు. పరిసరాలన్నీ మసక మసకగా ఉన్నాయి. నడుచుకుంటూ వస్తున్న ఆమెను గమనించి ఆ ఐదుగురు మూకుమ్మడిగా దాడి చేశారు. ‘కోర్టుకు ఎలా వెళ్తావో చూస్తం. నిన్ను వదిలిపెట్టం’ అంటూ బెదిరించారు. చిత్రహింసలు పెట్టారు. కత్తులతో పొడిచారు. తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్​ను ఆమెపై పోసి నిప్పంటించారు. ‘కాపాడండి.. కాపాడండి’ అంటూ కిలోమీటర్​ వరకు మంటలతోనే ఆ యువతి పరుగులు తీసింది.  శరీరం కాలిపోతున్నా  శక్తినంతా కూడదీసుకొని 112 నంబర్​కు కూడా కాల్​ చేసి పోలీసులకు, అంబులెన్స్​కు సమాచారం అందించింది. దూరం నుంచి మంటలను గమనించిన స్థానికులు వాటిని మొదట చలిమంటలు అనుకున్నారు. ఆ తర్వాత విషయం తెలుసుకొని అక్కడికి వచ్చేసరికి నిందితులు ఉడాయించారు.

పరిస్థితి తీవ్ర విషమం

ఘటనలో బాధితురాలు శరీరం 90 శాతం కాలిపోయింది. ఆమెను మొదట అంబులెన్స్​లో స్థానిక హాస్పిటల్​కు, అటు తర్వాత లక్నోలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి డాక్టర్లు ఢిల్లీలోని సఫ్దార్​జంగ్​ హాస్పిటల్​కు రిఫర్​ చేశారు. సాయంత్రం ఎయిర్​ అబులెన్స్​లో సఫ్దార్​జంగ్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. ఎయిర్​పోర్టు నుంచి హాస్పిటల్​ వరకు ట్రాఫిక్​ అంతరాయం లేకుండా గ్రీన్​కారిడార్​ను ఏర్పాటు చేశారు.  బాధితురాలి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని డాక్టర్లు అన్నారు.

ఐదుగురి పేర్లు చెప్పిన బాధితురాలు

లక్నో హాస్పిటల్​లో మెజిస్ట్రేట్​కు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. ఘటన మొత్తాన్ని వివరించింది. దాడి చేసిన ఐదుగురి పేర్లను చెప్పింది. ఇందులో శివం త్రివేది, శుభం త్రివేది గతంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్తుండగా దాడి చేశారని తెలిపింది. వారితోపాటు హరిశంకర్​ త్రివేది, రామ్​ కిశోర్​ త్రివేది, ఉమేశ్​ బాజ్​పాయ్ అనే ముగ్గురు కూడా దాడి చేశారని వివరించింది. దారుణానికి పాల్పడ్డ తర్వాత నిందితులు ఐదుగురూ తమ ఇండ్లల్లోనే దాక్కున్నారు. వారిని అక్కడే పోలీసులు అరెస్టు చేశారు.

పదిరోజుల కింద బెయిల్​పై వచ్చి..

అత్యాచారం కేసులో రిమాండ్​ ఖైదీలుగా ఉన్న శివం త్రివేది, శుభం త్రివేది తమ పలుకుబడిని ఉపయోగించి పదిరోజుల కింద బెయిల్​పై విడుదలయ్యారు. బాధితురాలిని ఎలాగైనా చంపేయాలని వాళ్లు పక్కా ప్లాన్​ వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం మరో ముగ్గురు స్నేహితులతో కలిసి వారు దారుణానికి ఒడిగట్టారు.  నిందితుల్లో ఒకరు ఆమెను పెండ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాదిలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెండ్లికి నిరాకరించడంతో అప్పట్లోనే కిడ్నాప్​ చేసి మరో నిందితుడితో కలిసి గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డారు.

యూపీ డీజీపీకి ఎన్​సీడబ్ల్యూ నోటీసు

ఈ కేసును జాతీయ మహిళా కమిషన్​ సుమోటోగా స్వీకరించింది. నివేదికను అందజేయాలని యూపీ డీజీపీ ఓపీ సింగ్‌‌‌‌ను కమిషన్​ చైర్​ఫర్సన్​ రేఖ శర్మ  ఆదేశించారు. మహిళలపై జరుగుతున్న దాడులు ఆవేదన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కేసుతో పాటు గత మూడేండ్లలో యూపీలో నమోదైన కేసులు, బెయిల్‌‌‌‌పై బయట ఉన్న నిందితుల వివరాలతో రిపోర్ట్‌‌‌‌ పంపాలని, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై కూడా పూర్తి వివరణ ఇవ్వాలని ఆమె డీజీపీకి ఆదేశించారు.

నిందితులను విడిచిపెట్టేది లేదు: యూపీ సీఎం

నిందితులను విడిచిపెట్టేది లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌‌‌ అన్నారు. బాధితురాలిని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, ఆమె ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు అయ్యే ఖర్చు గవర్నమెంటే భరిస్తుందని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రిపోర్ట్‌‌‌‌ ఇవ్వాలని పోలీసులను ఆయన ఆదేశించారు.

ఇదేం లా అండ్​ ఆర్డర్: ప్రియాంక గాంధీ​

ఉత్తర‌‌‌‌ప్రదేశ్‌‌‌‌లో లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా అదుపుతప్పిందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. ఆ రాక్షసులను వదిలిపెట్టొద్దని సమాజ్​వాద్​ పార్టీ ఎంపీ  జయాబచ్చన్‌‌‌‌ డిమాండ్​ చేశారు. 2017లో ఉన్నావ్​ జిల్లాలోనే ఓ బాలికపై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్యే  కుల్దీప్​ సెంగర్​ ఉన్నాడు.

రాముడూ గ్యారంటీ ఇవ్వలేడు: యూపీ మంత్రి

శ్రీరాముడు కూడా 100శాతం క్రైమ్​ ఫ్రీ సొసైటీకి గ్యారంటీ ఇవ్వలేడని యూపీ మంత్రి రాఘవేంద్ర ప్రతాప్​సింగ్​ వ్యాఖ్యానించారు. 100శాతం క్రైమ్​ఫ్రీ సొసైటీని కోరుకోవడం సహజమని అన్నారు.

దద్దరిల్లిన రాజ్యసభ

ఉన్నావ్​ ఘటనపై రాజ్యసభలో గురువారం దుమారం రేగింది. ఘటనపై చర్చ జరపాలని కాంగ్రెస్‌‌‌‌ సభ్యులు పట్టుబట్టారు. మధ్యాహ్నం సభ ప్రారంభమైన వెంటనే దీనిపై చర్చ జరగాలని కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ ఆనంద్‌‌‌‌ శర్మ డిమాండ్‌‌‌‌ చేయగా డిప్యూటీ ఛైర్మన్‌‌‌‌ హరివన్ష్‌‌‌‌ దానికి అంగీకరించకపోవడంతో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో డిప్యూటీ చైర్మన్‌‌‌‌  సభను అర్ధగంట పాటు వాయిదా వేశారు. అటు తర్వాత మళ్లీ సభ ప్రారంభమవగా చైర్మన్​ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఉన్నావో ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దారుణాలకు పాల్పడేవారికి కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను యావత్​ దేశానికి పంపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తల కోసం