
బిగ్ బాస్ 9 తెలుగు హౌస్‌లో రోజుకో నాటకీయత, వారానికో మలుపులతో ఆట రసవత్తరంగా మారుతోంది. లేటెస్ట్ గా హౌస్‌లో జరిగిన ఈవెంట్ లో భావోద్వేగాలను పతాక స్థాయికి చేర్చింది. తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ జంట పాయల్ చెంగప్ప, అభినవ్ మణికంఠ హౌస్‌లోకి అతిథులుగా వచ్చారు. కంటెస్టెంట్స్‌ను తమ ప్రేమ కథలను పంచుకోవాలని కోరారు. దీంతో ఒక్కొక్కరి ప్రేమ కథను వివరించారు. అందరితో నవ్వులు పూయించే కమెడియన్ ఇమ్మాన్యుయేల్ వంతు రాగానే, అతనిలో దాగి ఉన్న సున్నితమైన కోణం బయటపడింది. తాను ప్రేమించిన అమ్మాయి గురించి చెబుతూ ఇమ్మాన్యుయేల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి, కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను కలచివేసింది.
ముఖం చూడకుండానే ప్రేమ!
ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ... తాను స్టాండప్ షోలు చేస్తున్న రోజుల్లో, ఫేమస్ కాకముందు, ఒక అమ్మాయి పెద్ద మెసేజ్ చేసి తన నంబర్ అడిగిందని చెప్పాడు. అలా రోజూ మాట్లాడుకోవడం మొదలైంది. నేను ఆమె ముఖం చూడకుండానే ప్రేమించాను. ఆమె ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఫోటోలో ఏదో రోజ్ ఫ్లవర్ మాత్రమే ఉండేది అని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆ సమయంలో ఆమె ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోందని, అప్పుడే తాను 'చచ్చినా, బతికినా ఆమెతోనే కలిసుండాలి' అని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.
నా కోసం ఎందుకింత చేస్తుంది?
అయితే, తర్వాత తాను షూటింగ్స్‌లో బిజీ అవ్వడం వల్ల ఆ అమ్మాయికి సరిగా సమయం కేటాయించలేకపోయానని ఇమ్మాన్యుయేల్ అంగీకరించాడు. ఆమెను చాలా చిరాకు పెట్టాను, తిట్టాను, చాలా ఇబ్బంది పెట్టాను అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్‌కు వచ్చాకే నేను ఆమె విషయంలో ఎంత తప్పు చేశానో రియలైజ్ అయ్యాను. ఇక్కడ రోజు అందరినీ నవ్విస్తాను, కానీ పడుకున్నాక దుప్పటి కప్పుకుని ఏడ్చేస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
కప్పు గెలిచి ఆమె చేతిలో పెట్టడతా..
తన ప్రేయసి చేసిన త్యాగాన్ని ఇమ్మాన్యుయేల్ వెల్లడించాడు. నవంబర్‌లో పీజీ చేయడానికి విదేశాలకు వెళ్లాల్సిన ఆమె, తాను బిగ్ బాస్‌కు వస్తున్నానని తెలిసి తన ప్రయాణాన్ని ఆపేసుకుందని చెప్పాడు. నా అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేదు. అయినా నాకోసం ఉండిపోయింది. నాకోసం ఎందుకింత చేస్తుంది? ఆమెకు ఏం కర్మ? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
►ALSO READ | Sasivadane: గోదావరి అందాల నడుమ 'శశివదనే'.. అక్టోబర్ 10న ఎమోషనల్ లవ్ స్టోరీ రిలీజ్ !
అందుకే, ఈ కప్పు గెలిచి ఆమె చేతిలో పెట్టడమే తన ఏకైక లక్ష్యం అని ఇమ్మాన్యుయేల్ అన్నారు.. ఇమ్మాన్యుయేల్ ప్రేమ కథ విన్న కంటెస్టెంట్స్ అంతా ఎమోషనల్ అవగా, ప్రేక్షకులు కూడా ఈ కమెడియన్‌లోని నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ఈ భావోద్వేగ ఘట్టం ఇమ్మాన్యుయేల్‌ను టైటిల్ రేసులో మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందంటున్నారు అభిమానులు.