మియాపూర్లో ప్రభుత్వ స్థలం ఆక్రమించి షెడ్డులు, గుడిసెలు !

మియాపూర్లో ప్రభుత్వ స్థలం ఆక్రమించి షెడ్డులు, గుడిసెలు !

హైదరాబాద్: మియాపూర్లో ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మియాపూర్ సర్వేనెంబర్ 100లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కబ్జాదారులు షెడ్డులు, గుడిసెల్లో ఉంటున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షెడ్డులు, గుడిసెలను పోలీస్ బందోబస్తు మధ్య హెచ్ఎండిఏ అధికారులు తొలగిస్తున్నారు.

హెచ్ఎండిఏ అధికారులు ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుండగా.. ఫెన్సింగ్ వేస్తున్న అధికారులను కబ్జాదారులు అడ్డుకున్నారు. ఫెన్సింగ్ పనులు నిలిపివేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు ఫెన్సింగ్ పనులను హెచ్ఎండిఏ అధికారులు కొనసాగిస్తున్నారు. పోలీసులు కబ్జాదారులను దరిదాపుల్లో రాకుండా కట్టడి చేశారు.

ఇదిలా ఉండగా.. అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, నాలాలు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించేందుకు ఎంఎంసీ (మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు కూడా ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి నాలా చెరువు వరకు ఉన్న ప్రాంతంలో 15 షెడ్లు, గుడిసెలను తొలగించారు. చెంగిచెర్ల కాకతీయనగర్‌లో అనధికారంగా నిర్మించిన మూడో అంతస్తును తొలగించారు.

ఘట్‌కేసర్ యామ్నంపేట్‌లో అనధికార మూడో, నాలుగో అంతస్తులపై చర్యలు చేపట్టారు. రాంపల్లి–చెర్లపల్లి రోడ్డులో అనధికార షెడ్‌ను తొలగించడంతో పాటు రాంపల్లి ఎక్స్‌రోడ్స్ వద్ద అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను తొలగించారు. యామ్నంపేట్‌లో అనధికార నాలుగో, ఐదో అంతస్తులపై కూడా చర్యలు చేపట్టారు. కుంట్లూర్‌లో అనధికార మూడో అంతస్తు పిల్లర్లను తొలగించగా, పెద్ద అంబర్‌పేట్‌లోనూ అక్రమ నిర్మాణానికి సంబంధించిన పిల్లర్లను తొలగించారు.