చేతులు లేకున్నా.. ప్రపంచాన్ని గెలిచింది.. పారా ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో శీతల్‌కు గోల్డ్‌‌

చేతులు లేకున్నా.. ప్రపంచాన్ని గెలిచింది.. పారా ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో శీతల్‌కు గోల్డ్‌‌
  • రెండు చేతులూ లేకుండా స్వర్ణం నెగ్గిన తొలి మహిళగా చరిత్ర

గ్వాంగ్జూ (సౌత్‌‌ కొరియా): ఆమెకు చేతులు లేవు. కానీ ఆత్మవిశ్వాసానికి కొదవ లేదు. ఎదురుగా వరల్డ్ నంబర్‌‌‌‌ వన్ ప్రత్యర్థి ఉంది. కానీ ఆమెలో  ఏమాత్రం బెదురులేదు. అసాధారణ పట్టుదలతో విల్లును పాదాలతో పట్టి గెలుపును గురిపెట్టింది. పారా ఆర్చరీ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో రెండు చేతులు లేకుండా బరిలోకి దిగి స్వర్ణం గెలిచిన తొలి మహిళా ఆర్చర్‌‌గా చరిత్ర సృష్టించింది. ఆమే 18 ఏండ్ల ఇండియా సంచలనం శీతల్ దేవి. శనివారం జరిగిన విమెన్స్‌‌ కాంపౌండ్‌‌ తుదిపోరులో అద్భుతమే ఆశ్చర్యపోయేలా లక్ష్యానికి గురి పెట్టిన శీతల్ స్వర్ణ పతకాన్ని అందుకుంది.  దాంతో పాటు టీమ్ ఈవెంట్‌‌లో సిల్వర్‌‌‌‌, మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌లో కాంస్యంతో ట్రిపుల్‌‌ ధమాకా మోగించింది.  జమ్మూ కాశ్మీర్‌‌కు చెందిన శీతల్ కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో 146–-143తో  టర్కీకి చెందిన వరల్డ్‌‌ నంబర్ వన్ ఆర్చర్ ఓజ్నూర్ క్యూర్ గిర్డిని ఓడించింది.  కాళ్లతో విల్లును పట్టుకొని.. భుజం, మెడ  సాయంతో బాణాలు సంధించే శీతల్ తన అసాధారణ ప్రతిభతో  పారా ఆర్చరీ వరల్డ్‌‌ను మరోసారి ఆశ్చర్యపరిచింది.

రెండు సంవత్సరాల క్రితం ఇదే ప్రత్యర్థి చేతిలో ఓడిపోయిన శీతల్ ఈసారి ప్రతీకారం తీర్చుకుని జగజ్జేతగా నిలిచింది.  మరోవైపు మెన్స్‌‌  కాంపౌండ్‌‌లో తోమన్ కుమార్ స్వర్ణం నెగ్గాడు. ఇద్దరు ఇండియన్స్ పోటీపడ్డ ఫైనల్లో పారిస్ పారాలింపిక్స్ కాంస్య పతక విజేత రాకేశ్ కుమార్ విల్లులో సాంకేతిక లోపం తలెత్తింది. పుల్లీ సమస్య కారణంగా అతను నాలుగు బాణాల తర్వాత పోటీ నుంచి వైదొలిగి సిల్వర్ అందుకోగా..  తోమన్ కుమార్ విజేతగా నిలిచాడు.

అంతకుముందు విమెన్స్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌‌లో శీతల్–సరిత ఆరంభంలో సత్తా చాటినా చివర్లో తడబడి 148–152 తేడాతో టర్కీ ద్వయం క్యూర్ గిర్డి–బుర్సా ఫత్మా చేతిలో ఓడిపోయి సిల్వర్‌‌‌‌తో సరిపెట్టారు. మిక్స్‌‌డ్ టీమ్ ఈవెంట్‌‌లో  శీతల్– తోమన్ కుమార్..  గ్రేట్ బ్రిటన్‌‌ ప్రత్యర్థులపై గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. మెన్స్‌‌ కాంపౌండ్ కాంస్య పతక పోరులో శ్యామ్ సుందర్ స్వామి స్వల్ప తేడాతో ఓడిపోవడంతో ఇండియా క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని కోల్పోయింది.