పాక్ కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్

పాక్ కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్

పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాక్ పీఎంగా మూడుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన నవాజ్ షరీఫ్ సోదరుడైన షహబాజ్ షరీఫ్‌ను కొత్త ప్రధానిగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష పీఎంఎల్ఎన్ పార్టీ అధ్యక్షుడైన షహబాజ్ షరీఫ్ ఈ రోజు పాక్ 23వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

ప్రధాని ఎన్నిక కోసం ఇవాళ పాక్ నేషనల్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్.. పీటీఐ సభ్యుల రాజీనామాతో ఏర్పడిన ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఓటింగ్ నిర్వహించింది.  దాదాపు 12 గంటల పాటు జరిగిన చర్చ అనంతరం నిర్వహించిన ఓటింగ్ లో షహబాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని పదవి కోసం పీటీఐ నుంచి షా మహమ్మద్‌ ఖురేషీ, పీఎంఎల్ఎన్ నుంచి షహబాజ్‌ షరీఫ్‌ పోటీపడ్డారు. అయితే పీటీఐ సభ్యుల మూకుమ్మడి రాజీనామాతో ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ఖురేషీకి సభ్యుల మద్దతు లేకుండా పోయింది. దీంతో షహబాజ్ షరీఫ్ ఎన్నిక సుగమమైంది.

1951 సెప్టెంబర్ 23న జన్మించిన షహబాజ్ లాహోర్లోని గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు. వృత్తిరిత్యా వ్యాపారవేత్త అయిన ఆయన స్టీల్ బిజినెస్ చేసేవారు. 1985లో లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్గా షహబాజ్ ఎన్నికయ్యారు. 1980లలో రాజకీయ అరంగేట్రం చేసిన షహబాజ్.. 1997లో తొలిసారి పంజాబ్ సీఎంగా ఎన్నికయయ్యారు. 1999లో సైనిక తిరుగుబాటు అనంతరం కుటుంబంతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన.. 2007లో తిరిగి పాకిస్థాన్లో అడుగుపెట్టారు. 2008లో జరిగిన ఎన్నికల్లో పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా ఎన్నికయ్యారు.  2013లోనూ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన పాలనాకాలంలో సమర్థుడైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న షహబాజ్.. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో తన మార్కు చూపించారు. 

2017లో పనామా పేపర్స్ కేసులో దోషిగా తేలడంతో నవాజ్ షరీఫ్ను గద్దె దింపారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్ఎన్ తరఫున ప్రధాని అభ్యర్థిగా షహబాజ్ షరీఫ్  బరిలో నిలిచారు. అయితే అప్పట్లో పీటీఐ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2020 సెప్టెంబర్లో షహబాజ్ షరీఫ్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2021 ఏప్రిల్లో మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్ట్ కాగా.. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ కొనసాగుతోంది.