కామారెడ్డి లో మహిళా సంఘాల లావా దేవీలు.. ఇక ఆన్లైన్ లో..

కామారెడ్డి లో  మహిళా సంఘాల లావా దేవీలు.. ఇక ఆన్లైన్ లో..
  • పైలట్ ప్రాజెక్టుగా భాగీర్తిపల్లి ఎంపిక, వచ్చే నెలలో ట్రయల్ రన్   
  •     సభ్యుల ఫోన్లలో ప్రత్యేక యాప్​డౌన్​లోడ్​
  •     చెల్లింపులు, తీసుకున్న రుణం తెలుసుకునేందుకు అవకాశం
  •     విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు 

కామారెడ్డి, వెలుగు :  మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలను పూర్తిగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలో నిర్వహించేందుకు సెర్ఫ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నగదు రహిత లావాదేవీల ద్వారా పారదర్శకత పెంచేందుకు ఈ ప్రక్రియను అమలు చేయనున్నారు. ప్రతి సభ్యురాలు సంఘానికి చెల్లించే పొదుపు, రుణ వాయిదాలు తదితరవాటిని యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. సభ్యుల సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లలో యూపీఐ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు లావాదేవీల వివరాలను పరిశీలించేందుకు ప్రత్యేక యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయనున్నారు. 

ఈ విధానాన్ని అమలు చేసేందుకు ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా భిక్కనూరు మండలంలోని భాగీర్తిపల్లి గ్రామాన్ని సెర్ఫ్ అధికారులు ఎంపిక చేశారు. వచ్చే నెల మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఎదురయ్యే సమస్యలను విశ్లేషించి సవరణలు చేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. మొదట భాగీర్తిపల్లి తర్వాత జిల్లాలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామంలో అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.  

ప్రస్తుతం లావాదేవీలు ఇలా...

ప్రస్తుతం మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలు నగదు రూపంలో జరుగుతున్నాయి. సభ్యులు ప్రతి నెలా చెల్లించే పొదుపు, రుణ వాయిదాలు మీటింగ్ రోజున నగదు రూపంలో సమర్పిస్తున్నారు. చెల్లించిన అమౌంట్​ను రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. గ్రామ సంఘం లేదా బ్యాంక్ ద్వారా తీసుకున్న రుణాలను సంఘం ప్రతినిధులు బ్యాంకులో జమ చేస్తున్నారు. ఈ వివరాలన్నీ వీవోఏ రికార్డుల్లో నమోదవుతున్నాయి.   

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ విధానం ఇలా..

ప్రతి సభ్యురాలి ఫోన్ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. సభ్యురాలి వద్ద ఫోన్ లేకపోతే కుటుంబ సభ్యుల ఫోన్ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు. పొదుపు మొత్తాలు, రుణ వాయిదాలు అన్నీ యూపీఐ ద్వారానే చెల్లించాలి. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సభ్యురాలు చెల్లించిన పొదుపు మొత్తం, తీసుకున్న రుణం, చెల్లించిన వాయిదాలు, మిగిలిన బకాయి వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇతర సభ్యులు రుణాలు చెల్లించారా లేదా అన్న సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. దీంతో లావాదేవీల్లో పూర్తి పారదర్శకత ఉంటుంది. 

ప్రస్తుతం నగదు విధానంలో రికార్డు నమోదు చేయకపోవడం లేదా బ్యాంకులో జమ చేయడంలో ఆలస్యం వంటి కారణాల వల్ల నిధుల దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ విధానంతో అలాంటి సమస్యలకు తావుండదు. సభ్యులు బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మీటింగ్ ప్రదేశంలోనే లేదా ఇంటి వద్ద నుంచే చెల్లింపులు చేయవచ్చు. 

పైలట్ ప్రాజెక్టుగా భాగీర్తిపల్లి..

భిక్కనూరు మండలంలోని భాగీర్తిపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గ్రామంలో  52 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 529 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలో 17,290 సంఘాలు ఉండగా,  సుమారు 1.70 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లావాదేవీలను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.