శిఖర్ ధావన్ కెరీర్ ముగిసినట్టేనా..!

శిఖర్ ధావన్ కెరీర్ ముగిసినట్టేనా..!

వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ కెరీర్ ఎండింగ్కు వచ్చిందా ?  శ్రీలంకతో సిరీస్కు సెలెక్టర్లు అతడిని పక్కనబెట్టడడంతో ధావన్ కెరీర్ దాదాపుగా ముగిసినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయి వన్డేలకు పరిమితమైన  ధావన్..  వచ్చే ఏడాది భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ ఆడి కెరీర్ ను ముగిద్దామనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన వన్డే సిరీస్‌లలో పేలవ ప్రదర్శనతో ఇబ్బందిపడిన ధావన్‌ను వన్డే జట్టులోకి తీసుకోలేదు. పలు అంతర్జాతీయ పర్యటనల్లో వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు.. ఇటీవల కాలంలో ఫామ్ లేమితో సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

శ్రీలంక తర్వాత టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతోనూ వన్డే సిరీస్‌లు ఆడనుంది. అయితే రోహిత్‌ శర్మ – కేఎల్‌ రాహుల్‌ జోడీ రూపంలో ఓపెనర్లు ఉండగా.. యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ సైతం చెలరేగుతున్నాడు. ఇక మరో యువ ప్లేయర్‌ శుబ్‌మన్‌ గిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో వెటరన్‌ ఓపెనర్‌ ధావన్‌కు వీళ్ల నుంచి గట్టి ఎదురవుతోంది. లంకతో సిరీస్‌లో వచ్చిన అవకాశాల్ని వాళ్లు సద్వినియోగం చేసుకుంటే.. ఇక ధావన్‌ను పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. తన కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడే ఛాన్స్‌ లేకపోలేదు.

అటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొన్నాళ్లుగా ఆకట్టుకోని వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పైనా సెలెక్టర్లు వేటు వేశారు. టెస్టుల్లో బాగానే ఆడుతున్నా.. టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్‌లలో రిషబ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో అతడి స్థానంలో ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌లకు అవకాశం కల్పించారు. మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు కూడా సెలక్టర్లు మొండి చెయ్యే చూపించార. టీ20 వరల్డ్ కప్‌లో ఒత్తిడికి లోనై పరుగులు సమర్పించుకున్న అతడిని లంక పర్యటనకు తీసుకోలేదు. జనవరి 3 నుంచి 15 వరకు శ్రీలంక భారత్‌లో పర్యటించనుంది. టీ20లకు హార్దిక్ పాండ్యా నేతృత్వం వహించనుండగా.. వన్డేలకు రోహిత్ కెప్టెన్ గా ఉండనున్నాడు.